యాసంగి లక్ష్యంలో 6 శాతమే! | Political Parties Gives Promises To Farmers | Sakshi
Sakshi News home page

యాసంగి లక్ష్యంలో 6 శాతమే!

Published Sun, Nov 4 2018 2:47 AM | Last Updated on Sun, Nov 4 2018 7:43 AM

Political Parties Gives Promises To Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు యాసంగి రుణాలిచ్చేందుకు గజగజలాడుతున్నాయి! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన రైతు రుణమాఫీ హామీలు దడ పుట్టిస్తుండటంతో రైతులకు కొత్త రుణాలివ్వకుండా వారికి చుక్కలు చూపిస్తున్నాయి. నిబంధనల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది (2018–19)కి ఇవ్వాల్సిన రైతు రుణాల లక్షం రూ. 17 వేల కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ. వెయ్యి కోట్లే (సుమారు 6 శాతం) ఇచ్చాయి. దీంతో లక్షలాది మంది అన్నదాతలు ఇప్పుడు అప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ పార్టీల రుణమాఫీ హామీల కారణంగా తాము నిబంధనలు పాటించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతుంటే నిబంధనల పేరు చెప్పి బ్యాంకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణం తీసుకుంటే ఎలాగూ మాఫీ అవుతుందన్న ధీమాతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 19 శాతం కొత్త ఖాతాదారులు నమోదయ్యారని, రబీలో కూడా రుణాలు ఇస్తే ఆ సంఖ్య 40 శాతం దాటుతుందని ఓ బ్యాంకు అధికారి వెల్లడించారు.

లక్ష్యం రూ. 17 వేల కోట్లు...
ఇచ్చింది రూ. 1,000 కోట్లే...

రబీలో తెలంగాణ రైతాంగానికి రూ. 17 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొదట్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు అక్టోబర్‌లోనే రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే రుణాల మంజూరులో బ్యాంకులు ఒక్కసారిగా అన్ని నిబంధనలను తెరమీదకు తెచ్చాయి. రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించడం లేదు.  ఎవరైనా రైతు ఎక్కువ రుణం కావాలని వెళ్తే నిబంధనల ప్రకారం మీకు వచ్చేది అందులో 25 శాతమేనని చెబుతున్నాయి. రైతు అడిగిన మొత్తంలో అతని లావాదేవీలనుబట్టి 80 శాతం నుంచి 90 శాతం ఇవ్వడమన్నది సాధారణం. కానీ ఈసారి బ్యాంకులు అందుకు అంగీకరించడం లేదు. ఈ కారణంగా నవంబర్‌ 2వ తేదీ నాటికి తెలంగాణలో రైతాంగానికి ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 1,000 కోట్ల లోపే. నెలాఖరు దాకా రుణాలు ఇచ్చినా ఆ మొత్తం రూ. 2,000 కోట్లు దాటకపోవచ్చని బ్యాంకర్లే అంటున్నారు. గతేడాది (2017–18) రబీలో రూ. 15,901 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే బ్యాంకులు 10,384 కోట్లు ఇచ్చాయి. అంతకు ముందు ఏడాది అంటే 2016–17లో రూ.15 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుని రూ.13456 కోట్లు మంజూరు చేశాయి. ఈ ఏడాది మాత్రం లక్ష్యంగా 25 శాతం కూడా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు.

క్యూ కడుతున్న కొత్త రైతులు...
గత ఖరీఫ్‌ సీజన్‌లో మునుపెన్నడూ లేనివిధంగా 19 శాతం కొత్తవారు రైతు రుణాలు పొందారని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రుణాల కోసం క్యూ కడుతున్నారని, ఈ పరిణామం నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇబ్బందిగా మారింద ని కూడా బ్యాంకర్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైనా పంట రుణం కోసం వెళ్తే బ్యాంకర్లు వారిని ఏం పని చేస్తుంటారని అడుగుతున్నారు. ఒకవేళ ఫలానా ఉద్యోగం అని చెబితే మరి వ్యవసాయ రుణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అప్పు కావాలని ఎవరైనా కొత్త రైతు గట్టిగా అడిగితే బ్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ వస్తారు.. పంటల సాగు కోసం ఏం చేస్తున్నారో పరిశీలిస్తారని చెబుతున్నారు.  

అప్పు ఖాతాకు రైతు బంధు సొమ్ము బదిలీ
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పంట రుణం మాఫీ అవుతుందని భావించి రైతులు ఖరీఫ్‌ రుణాలు చెల్లించలేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్న మొత్తం రైతు బ్యాంకు ఖాతాలో పడగానే బ్యాంకర్లు దాన్ని వెంటనే ఆ రైతు అప్పు ఖాతాకు బదిలీ చేసేస్తున్నారు. దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేవారు రుణమాఫీ చేస్తామంటుంటే బ్యాంకులు సతాయిస్తున్నాయని మండిపడుతున్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం యాపలగూడెంకు చెందిన సంజీవరెడ్డి రబీలో వరి సాగుకు రూ. లక్ష రుణం కావాలని ఎస్‌బీఐని ఆశ్రయించాడు. ఖరీఫ్‌ సీజన్‌లో రుణం ఎందుకు తీసుకోలేదు? మాఫీ ఆశించి రుణం కోసం ఇప్పుడు వచ్చావా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి కదా వ్యవసాయం ఎలా చేస్తావు? అంటూ యక్ష ప్రశ్నలు వేసిన బ్యాంకు అధికారులు రుణం ఇవ్వబోమన తేల్చిచెప్పారు.

కరీంగనర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గోపగాని సమ్మయ్య పంటల సాగు కోసం ఖరీఫ్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్‌ చేయించుకోవడంతోపాటు కొత్తగా మరికొంత రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. అయితే పూర్తి మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామన్న బ్యాంకు మెలికతో కంగుతిన్నాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌ మండలం కరివేన గ్రామానికి చెందిన గంగుల వేణుగోపాల్‌రెడ్డి ఖరీఫ్‌లో తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించడంతోపాటు రబీలో ఎక్కువ అవసరం ఉందని బ్యాంకును ఆశ్రయించాడు. గతంలో అడిగినంత రుణం ఇచ్చిన బ్యాంకు ఈసారి మాత్రం ఆయన అడిగిన దానిలో 25 శాతమే ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు.

రుణమాఫీ హామీలే కారణమా?
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్, రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే హామీలు ఇచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ పూర్తి రుణమాఫీ హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులతోపాటు బ్యాంకులు సంక్షోభాన్ని చవిచూశాయి. తెలంగాణలో రూ. లక్షలోపు రైతు రుణాలు చెల్లించడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల సమయం తీసుకుంది. ‘రైతు రుణమాఫీ హామీల కారణంగా బ్యాంకింగ్‌ రంగం ఇబ్బందుల పాలవుతోంది. ఇతర రంగాలకు సరైన సేవలు అందించలేకపోతున్నాము. ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలు రుణమాఫీ అంటుండటంతో వసూళ్లలో మందగమనం ఏర్పడింది. ఖరీఫ్‌లో అది మరింతగా పెరిగింది’అని లీడ్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) సీనియర్‌ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని లీడ్‌ బ్యాంక్‌ తెలంగాణలోని అన్ని బ్యాంకు శాఖలను ఆదేశించింది. ట్రాక్‌ రికార్డు బాగున్న రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నామని ఆ అధికారి అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నది బ్యాంకులు, రైతులేనని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించామని హైదరాబాద్‌ రిజర్వు బ్యాంక్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement