సిటీ నీరవ్‌.. రంగారెడ్డి | taskforce police arrest bank loans cheater rangareddy | Sakshi
Sakshi News home page

రంగ..రంగా!

Published Fri, Feb 23 2018 8:21 AM | Last Updated on Fri, Feb 23 2018 8:21 AM

taskforce police arrest bank loans cheater rangareddy - Sakshi

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సిటీ ఇన్‌చార్జి సీపీ శ్రీనివాసరావు

లేని కంపెనీలను ఉన్నట్లు నమ్మించాడు. పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నట్లు నమ్మబలికాడు. వీరి పేరిట బ్యాంకుల్లో సాలరీ ఎకౌంట్లను ఓపెన్‌ చేసి...క్రెడిట్‌ కార్డులు సైతం పొంది దాదాపు కోటిన్నర రూపాయలకు టెండర్‌ వేశాడు నగరానికి చెందిన కంభం రంగారెడ్డి.ఉత్తరాదికి చెందిన నీరవ్‌ మోదీ మాదిరిగానే ‘షెల్‌ కంపెనీ’లతో బ్యాంకులను మోసగించాడు. రెండేళ్లుగా కనిపించకుండా తిరుగుతుండగా..ఎట్టకేలకు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగారెడ్డి ఆటకట్టించారు. ఇతనికి సహకరించిన 9 మందిని సైతం అరెస్టు చేశారు. 

సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన నీరవ్‌ మోదీ షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి ఒకే బ్యాంకు నుంచి రూ.వేల కోట్లు రుణాలు తీసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కుంభం రంగారెడ్డి దాదాపు అదే బాటలో పయనించాడు. షెల్‌ కంపెనీ ఏర్పా టు చేయడంతో పాటు అందులో పదుల సంఖ్యలో బోగస్‌ ఉద్యోగులను క్రియేట్‌ చేసి వారి పేర్లతో నాలుగు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్స్‌ తెరిచాడు. వీటి ఆధారంగా క్రెడిట్‌ కార్డ్స్‌ పొంది రూ.1.52 కోట్ల మేర వాడేసుకున్నాడు. దాదాపు రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డితో పాటు ఇతడికి సహకరించిన 9 మంది నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో రెండు బ్యాంకులు, జీహెచ్‌ఎంసీకి చెందిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం ఉన్నట్లు సిటీ పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు గురు వారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్‌.చైతన్యకుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ పూర్తి వివరాలు వెల్లడించారు. 

రెండు కార్డులు ఇచ్చిన అనుభంతో...
నల్లగొండ జిల్లా తెలుగుపల్లికి చెందిన కుంభం రంగారెడ్డి డిగ్రీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. 1998 నుంచి హయత్‌నగర్‌ మండలంలోని తుర్కయాంజల్‌లో స్థిరపడిన ఇతను కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ట్రైనింగ్‌ తీసుకుని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఇందులో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. అదే సందర్భంలో తనతో పాటు భార్య పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండు క్రెడిట్‌ కార్డ్స్‌ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డికి బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్‌ డివిజన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న గోపతోటి కిషోర్‌బాబుతో పరిచయమైంది. అతడి ద్వారా క్రెడిట్‌ కార్డులు పొందే విధానం, జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నాడు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించిన రంగారెడ్డి తన బావమరిది తిప్పర్తి విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రంగంలోకి దిగాడు. కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని ‘ప్రణిక నానో సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. డేటా ప్రాసెసింగ్‌ చేస్తుందంటూ కేవలం నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేసి రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో రిజస్టర్‌ చేయించుకున్నాడు. ఈ తతంగం మొత్తం 2013 ఏప్రిల్‌లో జరిగింది. 

టీ స్టాల్, బార్బర్‌ షాపు నిర్వాహకులే..
తనకు పరిచయస్తులైన అనేక మంది నుంచి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించిన రంగారెడ్డి వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశాడు. కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఉండే కొందరు బార్బర్‌ షాపు యజమానులు, టీ స్టాల్‌ నిర్వాహకుల ఫొటోలు సైతం సేకరించి వీరు బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు పూర్తి చేసినట్లు నకిలీ వివరాలు సృష్టిస్తూ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్లుగా, హెచ్‌ఆర్‌ నిర్వాహకులుగా మార్చాడు. ఈ వ్యవహారాల్లో ఫొటోలు ఎవరివి తీసుకున్నా.. పేరు, చిరుమానాలు మాత్రం బోగస్‌వి వాడుతూ సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు వీరందరినీ ఉద్యోగులుగా మార్చేశాడు. వీరి వివరాలతో ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డు దరఖాస్తులను హయత్‌నగర్‌కు చెందిన ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడు మేక సంతోష్‌రెడ్డి ద్వారా అప్‌లోడ్‌ చేయించాడు. జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ సర్కిల్‌లో ఎలక్షన్‌ విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న వరికుప్పల శ్రీకాంత్, మేకల నరేష్‌ ద్వారా ఈ దరఖాస్తులను అప్రూవ్‌ చేయించి ఓటర్‌ ఐడీ కార్డులు తీసుకున్నాడు. వీటి  ఆధారంగా పాన్‌కార్డులు సైతం పొందాడు. మొత్తం 41 మంది తన సంస్థలో పని చేస్తున్నట్లు క్రియేట్‌ చేసిన రంగారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి  వారి పేర్లతో ఓ ప్రైవేట్‌ బ్యాంకులో శాలరీ అకౌంట్స్‌ తెరిచాడు. ఒక్కో కార్డుకు సంబంధించిన సంతోష్‌కు రూ.2 వేలు, శ్రీకాంత్‌కు రూ.1500, నరేష్‌కు రూ.1000 చొప్పున చెల్లించారు. 

మూడు నెలలు జీతాల కథ నడిపి...
ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్‌ ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్‌ పుస్తకాలను రంగారెడ్డి, విజయ్‌కుమార్‌ తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకున్నారు. ఇలా రూపొందించిన స్టేట్‌మెంట్స్, బోగస్‌ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని ఎస్బీఐ. హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్‌ చార్టర్డ్, ఆర్‌డీఎల్‌ బ్యాంకులకు క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్‌ డివిజన్‌లో, వెరిఫికేషన్‌ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు గోపతోటి కిషోర్‌బాబు, జి.శైలేష్‌కుమార్, ఎస్బీఐకి చెందిన ఆర్‌.సందీప్‌ కుమార్, యు.ఆనంద్‌రావు సహాయంతో కార్డులు మంజూరయ్యేలా చేశాడు. ఒక్కో కార్డుకు కొంత కమీషన్‌గా చెల్లిస్తూ వివరాలు సరిచూడకుండా, కార్డులు నేరుగా తమ చేతికే అందేలా రంగారెడ్డి, విజయ్‌లు సఫలీకృతులయ్యారు. తమ సంస్థ పేరుతో సంతోష్‌నగర్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మిషన్‌ సైతం పొందారు. దీంతో పాటు కొన్ని పెట్రోల్‌ బంకులు, సంస్థల్లో ఈ కార్డుల్ని స్వైప్‌ చేస్తూ వచ్చారు. ఇలా మొత్తం 41 మంది పేర్లతో 4 బ్యాంకుల నుంచి 125 క్రెడిట్‌కార్డులు తీసుకుని ‘వాడేశాడు’. 

మూడు శాతం కమీషన్‌ ఇస్తూ...
రంగారెడ్డి, విజయ్‌ తాము తీసుకువచ్చిన క్రెడిట్‌కార్డుల్ని పీఓఎస్‌ మిషన్లలో స్వైప్‌ చేసి, నగదు ఇవ్వడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను వారికి 3 శాతం కమీషన్‌ ఇస్తూ వీరు 97 శాతం నగదు తీసుకునేవారు. ఇలా మొత్తం నాలుగు బ్యాంకుల నుంచి రూ.1,52,10,725 కాజేసి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుని మాకాం మార్చేశారు. ఈ స్కామ్‌ మొత్తం 2015 వరకు జరిగింది. డిఫాల్టర్ల కోసం కొన్నాళ్ళు ప్రయత్నించిన బ్యాంకు ప్రతినిధులు బోగస్‌ వివరాలని తెలియడంతో మిన్నకుండిపోయారు. ఓ బ్యాంకు ద్వారా సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్‌ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌ రెడ్డి, కె.శ్రీకాంత్‌ దర్యాప్తు చేశారు. గురువారం రంగారెడ్డితో పాటు విజయ్, సంతోష్, శ్రీకాంత్, నరేష్, కిషోర్, శైలేష్, సందీప్, పరమేష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6.9 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సంపాదించిన సొమ్మును రంగారెడ్డి కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందని, దానిని రికవరీ చేయడానికి   చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement