రంగారెడ్డి, పట్టించిన బైక్ ఫొటో
సాక్షి, సిటీబ్యూరో: కర్మన్‌ఘాట్‌లో తన కుమార్తె పేరిట ‘ప్రణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి నాలుగు బ్యాంకులను రూ.1.52 కోట్లకు ముంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రంగారెడ్డిని పోలీసులు ఫేస్‌బుక్ పేజీ ఆధారంగా పట్టుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన రంగారెడ్డి ఆదిభట్ల ప్రాంతంలోని ఓ పుట్టగొడుగుల పరిశ్రమలో పెట్టుబడి పెట్టి రైతుగా మారిపోయాడు. డిఫాల్టర్లందరూ ప్రణిక సంస్థకు చెందిన ఉద్యోగులేనని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నుంచి కంపెనీ రికార్డులు సేకరించారు. తద్వారా కుంభం రంగారెడ్డి దానికి సీఈఓగా తెలిసింది. మరికొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ స్కామ్‌కు అతడే సూత్రధారిగా గుర్తించారు. అతడికి సంబంధించిన చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌లో కుంభం రంగారెడ్డి పేరుతో సెర్చ్ చేశారు. అలా లభించిన ఫేజ్‌లో ప్రణిక సంస్థకు సీఈఓగా పేర్కొని ఉండటంతో అతడే తమకు ‘కావాల్సిన వ్యక్తి’గా నిర్ణయించుకున్నారు.
కొత్త బైక్ పోస్ట్ ‘పట్టుకుని’ ముందుకు...
రంగారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఫేస్‌బుక్ సైతం వాడటం మానేశాడు. ఈ నేపథ్యంలోనే 2016 జనవరి 17న ఆఖరి అప్‌డేట్ ఉంది. దీంతో ఆ పేజ్‌లో ఉన్న ఒక్కో పోస్ట్‌ను అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను 2015 ఫిబ్రవరి 15 నాటి పోస్ట్ ఆకర్షించింది. అంతకు ముందు రోజు ఖరీదు చేసినట్లు చూపిస్తూ రంగారెడ్డి ‘మై న్యూ బైక్’ అంటూ ఓ హోండా సీడీఆర్ వాహనం ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో ఆయా తేదీల్లో ఈ వాహనాలు ఖరీదు చేసిన వారి వివరాలు సేకరించిన పోలీసులు సదరు వాహనం నెంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ట్రాఫిక్ పోలీసు డేటాబేస్‌ను సెర్చ్ చేసి దానిపై జారీ అయిన ఈ–చలాన్ల ఆధారంగా ఆదిభట్ల ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. వీటిని బట్టి రంగారెడ్డి ఆ ప్రాంతంలోనే ఉండచ్చనే ఉద్దేశంతో గాలింపు చేపట్టారు. ఆ వాహనం ప్రస్తుతం మరో వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాదాపు వారం రోజుల పాటు అతడిని ఫాలో అయ్యారు.
‘360 డిగ్రీస్’తో చిక్కిన ఆధారం
మరోపక్క సిటీ పోలీసు విభాగం ఖరీదు చేసిన ‘360 డిగ్రీస్ వ్యూ’ అనే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి పేరును ఉంచి సెర్చ్ చేస్తే... అతడి పేరుతో ఉన్న వాహనాలు, ఇతర అంశాలు తెలుస్తారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పేరుతో మరో కారు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఓపక్క ద్విచక్ర వాహనం, మరోపక్క కారు నెంబర్ల ఆధారంగా ఆదిభట్ల ప్రాంతంలో గాలించిన టాస్క్‌ఫోర్స్ బృందాలు గురువారం తెల్లవారుజామున రంగారెడ్డిని గుర్తించి పట్టుకున్నాయి. ఇతడిచ్చిన సమాచారంతో మిగిలిన తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. రంగారెడ్డితో పాటు మరో నిందితుడైన విజయ్ బోగస్ వివరాలతో తీసుకున్న క్రెడిట్ కార్డుల్ని పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి, నగదుగా మార్చుకున్నారు. ఇలా నగదు ఇచ్చినందుకు మిషన్ నిర్వాహకులకు 3 శాతం కమీషన్ ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వారికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment