ముంబై: బ్యాంకు రుణాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధిని చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7 శాతంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరగడం ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడాన్ని తెలియజేస్తోందని ఆర్‌బీఐ ప్రకటించింది. ‘‘రుణాల్లో వృద్ధి అన్ని విభాగాల్లోనూ ఉంది. అన్ని రకాల జనాభా వర్గాల్లో, బ్యాంకుల్లో రెండంకెల వార్షిక వృద్ధి నమోదైంది’’అని తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సంబంధించి త్రైమాసికం వారీ డిపాజిట్లు, రుణ గణాంకాలను ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బ్యాంకుల రుణాల్లో వృద్ధి 14.2 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించింది. క్రితం త్రైమాసికంతో పోల్చి చూసినా, అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినా రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది.
దండిగా డిపాజిట్లు..
ఇక బ్యాంకుల డిపాజిట్లు సెప్టెంబర్ త్రైమాసికంలో 9.2 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి బ్యాంకుల డిపాజిట్లు సగటున 9.5–10.2 శాతం మధ్య వృద్ధి చెందుతున్నాయి. విదేశీ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులే అధిక డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. టర్మ్ డిపాజిట్లలో 10.2 శాతం వృద్ధి కనిపించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో టర్మ్ డిపాజిట్లు 6.4 శాతమే పెరగడం గమనించాలి. ఇక కరెంట్ డిపాజిట్లు 8.8 శాతం, సేవింగ్స్ డిపాజిట్లు 9.4 శాతం వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి 17.5 శాతం, 14.5 శాతం చొప్పున వృద్ధిని చూశాయి. మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్లు 2019 జూన్ నాటికి 32.4 శాతంగా ఉంటే, 2022 జూన్ నాటికి 35.2 శానికి పెరిగాయి. తదుపరి సెప్టెంబర్ త్రైమాసికంలో 34.7 శాతానికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా క్రెడిట్–డిపాజిట్ రేషియో 74.8 శాతానికి మెరుగుపడింది.
రుణ వృద్ధి పటిష్టం
2022–23పై ఫిచ్ అంచనా
భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 11.5 శాతం పటిష్ట రుణ వృద్ధితీరును నమోదుచేస్తుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. రుణ వృద్ధికి అధిక వడ్డీరేట్లు అడ్డంకి కాబోవని కూడా స్పష్టం చేసింది. భారీ రుణ వృద్ధి వల్ల నికర ఆదాయాలు ప్రత్యేకించి నికర వడ్డీ మార్జిన్లు పటిష్టంగా ఉంటాయని వివరించింది. ‘‘2021–22లో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం. 2022–23లో ఈ రేటు 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్ తదనంతరం సానుకూల పరిస్థితులు, చక్కటి జీడీపీ వృద్ధి రేటు వంటి అంశాలు రిటైల్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు డిమాండ్ పెంచుతుందని భావిస్తున్నాం’’ అని ఈ ఒక ప్రకటనలో వివరించింది. 2022–23లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా. కాగా, బ్యాంకింగ్ డిపాజిట్లు 2022–23లో 11 శాతం పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంల్లో రుణ వృద్ధి కొంత మందగిచ్చవచ్చని ఫిచ్ అంచనా వేస్తోంది. ‘‘డిపాజిట్ రేట్లు పెరగడం బ్యాంకుల వడ్డీ మార్జిన్లపై ప్రభావితం చూపవచ్చు. అయితే నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం బ్యాంకులకు ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉంటుంది’’ అని ఫిచ్ విశ్లేషించింది.
బ్యాంకు రుణాల్లో 17% వృద్ధి
Published Tue, Nov 29 2022 5:34 AM | Last Updated on Tue, Nov 29 2022 5:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment