కుంటిసాకులు!  | Kharif Crops Loans Bank Officers Negligence Mahabubnagar | Sakshi
Sakshi News home page

కుంటిసాకులు! 

Published Mon, Jan 28 2019 9:16 AM | Last Updated on Mon, Jan 28 2019 9:16 AM

Kharif  Crops Loans Bank Officers Negligence Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: సంక్షేమ పథకాల అమలులో భాగంగా రైతులకు అందించే పంట రుణాలు జిల్లా వ్యాప్తంగా సగం మందికే అందడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రైతులకు పంట రుణాలు సకాలంలో ఇవ్వాలని ఉన్నతాధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నా అమలు కావడంలేదు. గత ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్‌ మాసం వరకు రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. అలాగే రబీ రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం ఐదు శాతానికి కూడా మించలేదు. దీనికి బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. 

రెన్యూవల్‌కు వెనుకంజ 
ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు తాము అధికారంలోకి వస్తే రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటికే రుణాలు తీసుకున్న రైతులు రెన్యూవల్‌ చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. బ్యాంకులు, రైతుల మధ్య వారధిగా ఉండి పంట రుణాలు సకాలంలో మంజూరీ విషయంలో ప్రముఖపాత్ర పోషించే లీడ్‌ బ్యాంకు అధికారులు సైతం  నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందాయి. ఖరీఫ్‌ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్‌ నాటికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నా వీరి వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో రుణాల మంజూరీపై స్పష్టత కనిపించడం లేదు.

 లక్ష్యం మంచిదే కానీ.. 
ఖరీఫ్‌లో జిల్లా వార్షిక రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు. అయితే ఇందులో ఇచ్చింది రూ. 250 కోట్లు మాత్రమే. అంటే సగం లక్ష్యాన్ని కూడా చేరలేదు. ఇక రబీలో రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం 5 శాతానికి కూడా మించలేదు. అంటే రైతులు ఈసారి రుణాల కోసం బ్యాంకులకు కూడా వెళ్లలేదన్న మాట. గతంలో మాదిరిగా కనీసం రెన్యూవల్‌ కూడా చేసుకోలేదు. దీంతో లక్ష్యం నీరుగారిపోతుంది.

రుణమాఫీ ప్రకటనలే కారణమా? 
అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయించారు. తాజా ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ప్రకటించడంతో పంట రుణాలు చెల్లించేందుకు చాలామంది రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఏకంగా రూ. రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించగా బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ మాఫీ అంశాన్నే ప్రచారం చేస్తున్నాయి.

ఇక అధికార టీఆర్‌ఎస్‌ సైతం రుణ మాఫీని మరోసారి వర్తించనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో రైతులు రుణం చెల్లించేందుకు కనీసం రెన్యూవల్‌ చేయించుకునేందుకు ముందుకురావడం లేదని సమాచారం. ఇదిలాఉండగా ప్రధాన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు రబీలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాల్సి ఉండగా రుణాలు చెల్లించేందుకు గానీ, రీ షెడ్యూల్‌ చేసుకునేందుకు గానీ రైతులెవరూ ముందుకు రావడం లేదు. రబీలో జిల్లాలో రూ. 940 కోట్లు రుణం ఇవ్వాలని లక్ష్యం ఉండగా అందులో 5 శాతం కూడా పూర్తి కాలేదు. అయితే ఇండియన్‌ బ్యాంకు, కొటక్‌ మహేంద్ర బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు టార్గెట్లు పెట్టుకున్నప్పటికినీ ఖరీఫ్‌ సీజన్‌లో జీరో శాతం కూడా పంట రుణాలు ఇవ్వలేదు.

మాఫీ కలిసి వస్తుందా? 
వాస్తవంగా బ్యాంకుల్లో పంట రుణం తీసుకుంటే ప్రభుత్వం పంట రుణాన్ని మాఫీ చేసినప్పుడు మాఫీ వర్తిస్తుంది. రుణాన్ని రీ షెడ్యూల్‌ చేసినా వర్తిస్తుంది. ఈ విషయంలో రైతులకు అవగాహన ఉండదు. అందుకే రీ షెడ్యూల్‌కు ముందుకు రావడం లేదు. జిల్లాలోని రైతుల్లో దాదాపు 80 శాతం మంది రైతులు రూ. లక్షలోపు రుణం తీసుకున్న వారే ఉన్నారు. పంట రుణం రీ షెడ్యూల్‌ చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ సక్రమంగా రాకపోవడంతో బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి.

వడ్డీతో పాటు ఇన్సూరెన్స్, బ్యాంకు ఖర్చులు ఇలా బ్యాంకులు ఇచ్చే లక్ష రుణానికి రూ.10వేలు అవుతున్నాయి. ఎలాగో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రుణమాఫీ వాగ్ధానాలు ప్రకటించగా వడ్డీతో సహా అధికారంలోకి వచ్చిన పార్టీలే చెల్లిస్తాయని రైతులు భరోసాతో ఉన్నారు. దీంతో బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వసూలు చేసినా రుణం రూ.2 లక్షల మించి వెళ్లదని రైతులు బ్యాంకర్లకే చెప్పే పరిస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయి బ్యాంకు అధికారులు గ్రామాలకు వెళ్లి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్‌ చేసుకోమంటే గతంలో రుణం చెల్లించని వారికి మాఫీ అయ్యాయని, రెగ్యులర్‌గా చెల్లించిన వారికి మాత్రం మాఫీ కాలేదంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్‌ ముగిసే వరకు ఆగాలని బ్యాంకర్లను రైతులు బతిమిలాడుతున్నారు.

బ్యాంకులు ససేమిరా 
ఇప్పటికే బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న వారు ఎన్నికల వాగ్ధానాలతో చెల్లించేందుకు ససేమిరా అంటుంటే ఇదే సమయంలో బ్యాంకులు సైతం పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడం లేదు. నాబార్డు ప్రతిపాదించినట్లు రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ప్రతి బ్యాంకు పంట రుణాన్ని పెంచి ఇవ్వాలని, వరికి ఎకరానికి రూ. 32వేల నుంచి రూ. 33వేలు, మొక్కజొన్నకు రూ, 22 వేల నుంచి రూ. 23వేలు ఇలా ప్రతి పంటకూ పెంచి ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. కానీ బ్యాంకర్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేవంటూ దాటవేస్తున్నారు.

రైతులు రావడం లేదు 
పంట రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోమంటే కూడా రుణం మాఫీ అవుతుందంటూ వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లకు రకరకాల కారణాలు చెబుతున్నారు. దీంతో రైతులపై ఒత్తిడి చేయకలేపోతున్నాం. – ప్రభాకర్, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement