మరికల్ శివారులోని నెర్రెలు వచ్చిన పొలం
సాక్షి, మహబూబ్‌నగర్ : ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్‌లో వరిసాగు చేసి భంగపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా చెప్పుకోదగ్గ పెద్ద వర్షం కురవనేలేదు. చెరువులు, కుంటలు కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. బోరు బావుల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇదివరకే వేసిన వరి పొలాలు నెర్రెలుబారి కనిపిస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరదలు వచిచనా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. సాంకేతిక కారణాలతో పంపింగ్ నిలిచిపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
8 వేల హెక్టార్లలో వరిసాగు
వర్షాకాలం ప్రారంభంలో జిల్లాలో దామరగిద్ద, నారాయణపేట, మద్దూరు, కోస్గి, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. మరికల్, ధన్వాడ, నర్వ మండల్లాలో వర్షాపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా జూలై, ఆగస్టు మాసాల్లో ఇప్పటివరకు 8 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు వేశారు. కానీ వర్షాలు కురవక.. కోయిల్‌సాగర్ సాగునీరు రాక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోరుబావుల్లో కూడా నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే వరినాట్లు వేసిన రైతుల బోర్లలో నీళ్లులేక ట్యాంకర్లు తెప్పించుకుని నారును తడుపుతున్నారు. ఎరువులు, కూలీ ధరలు పెరిగి పెట్టుబడి ఖర్చు అధికమైందని రైతులు ఆందోళన చెందుతుంటే నీళ్లను కొనుక్కుని వేయడం వారికి అదనపు భారంగా మారింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తే కొంతవరకైనా పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని రైతులు వారం రోజుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారిగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం బోర్లు ఉన్న రైతులు మాత్రమే కేఎస్పీ ఆయకట్టు కింద వరినాట్లు వేస్తున్నారు. మిగితా రైతులు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి నీటి విడుదల కోసం వేచి ఉన్నారు.
సాంకేతిక లోపం రైతులకు శాపం
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. జూరాల నుంచి వరదనీరు తన్నుకు వస్తున్నా తీలేర్ పంపింగ్ వద్ద ఎత్తిపోతల మోటార్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆది వారం అర్ధరాత్రి మళ్లీ రెండు పంపులు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఇంజనీర్లు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పంపులు ప్రారంభమైన 11 రోజుల వ్యవధిలోనే ఇలా ఆటంకా లు ఎదురు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా గతంలో ఇలాగే సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఉంద్యాల, తీలేర్ పంపుహౌస్‌ల వద్ద కేవలం ఒకటీరెండు రోజుల్లో సరిచేసేవారు. ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ కంపెనీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండిం గ్ బకాయిలు రాకపొవడంతో వారు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నెలరోజుల క్రితం కోయిల్‌సాగర్ ఎత్తిపోతల బాధ్యతలను పవర్ సెల్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. మోటార్లకు సంబంధించిన టెక్నిషన్ సమస్యలు వారికి కొత్త కావడంతో నీటి పంపింగ్‌కు బ్రేక్ పడుతోంది. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ నాగిరెడ్డి వివరణ ఇస్తూ రాత్రి వరకు రెండు పంపులను సరిచేసి ప్రారంభిస్తామన్నారు.
చెరువులను నింపండి
తీలేర్ పంపుహౌస్ నుంచి వస్తున్న నీటితో పూర్తి స్థాయిలో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. రూ.30 వేల పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశాను. బోరులో ఇంకిపోవడంతో నీళ్లు పట్టే పరిస్థితి లేదు. పొలమంతా నెర్రెలు విచ్చింది. కనీసం కోయిల్‌సాగర్ నీటితోనైనా చెరువులను నింపితే పంటలను కాపాడుకుంటాం.
– గొల్ల రాజు, కౌలు రైతు, మరికల్
Comments
Please login to add a commentAdd a comment