జనం ఆస్తికి అధికారిక ముద్ర | AP Govt will officially seal assets worth above Rs 1 and half lakh crore | Sakshi
Sakshi News home page

జనం ఆస్తికి అధికారిక ముద్ర

Published Mon, Dec 21 2020 4:33 AM | Last Updated on Mon, Dec 21 2020 11:26 AM

AP Govt will officially seal assets worth nearly above Rs 1 and half lakh crore - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అలాగని అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులకు ఆ ఆస్తులతో ఎలాంటి ఇతర ప్రయోజనాలూ లభించడం లేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు.

ఇంటి పన్ను వసూలుకు వీలుగా గ్రామ పంచాయతీల వద్ద ఇళ్ల యజమానుల జాబితాలు తప్ప ఆయా ఇళ్లకు సంబంధించి రికార్డులు, ఆస్తి వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వద్ద లేవు. దీంతో ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషుల మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండటం లేదు. దీనివల్ల సరైన రేటూ లభించడం లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఇబ్బందులే. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠంలో ఉండే అలాంటి ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ ‘క్యూఆర్‌ కోడ్‌’ (వివరాలు తెలుసుకునేందుకు ఉపకరించే ఆప్టికల్‌ లేబుల్‌)తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంలో భాగంగా  సోమవారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనుంది.

ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ
► ఆస్తి సర్టిఫికెట్‌ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుంది. తద్వారా ఆస్తికి రక్షణ లభిస్తుంది. ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సహజంగానే ఆస్తి విలువ పెరిగిపోతుంది. 

► ఇల్లు/ స్థలం అమ్ముకోవాలనుకుంటే.. నిర్దిష్ట ఆస్తి సర్టిఫికెట్‌ ఉండటంతో సులభంగా మార్పిడి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ ఆస్తి సర్టిఫికెట్‌లో ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో గ్రామ పంచాయతీ వద్ద ఉండే రికార్డులలో సంబంధిత కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కొత్త యజమానిపేరుతో పంచాయతీ కార్యదర్శి ఆస్తి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.

► అలాగే ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్న సమయంలో.. పాత ఆస్తి సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పంపకంలో వచ్చిన వాటాల మేరకు అన్నదమ్ములకు వెంటనే కొత్త ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. 

► గ్రామాల్లో స్థలాల వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సులభంగా పరిష్కరించేందుకు కూడా వీలు కలుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 

సర్టిఫికెట్‌ జారీ ప్రక్రియ ఇలా..
► వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల పరిధిలో గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న వాటితో సహా అన్ని ఇళ్లు, ఇతర స్థలాలన్నింటినీ డ్రోన్ల ద్వారా ఏరియల్‌ సర్వే చేయనున్నారు. ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తించి, స్థానిక అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం విస్తీర్ణం, మూలలు, కొలతలు, ఇతర వివరాల నిర్ధారణతో రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. 

► గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, స్థలాలకు కొత్తగా సర్వే నంబర్లు కూడా కేటాయిస్తారు. ప్రతి ఇంటినీ, ప్రతి స్థలాన్ని వేర్వేరు ఆస్తిగా పేర్కొంటూ వాటికి వేర్వేరుగా గుర్తింపు నంబర్లను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. 

► ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను (ధ్రువీకరణ పత్రాలు) తయారు చేసి (వాటిపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తారు) గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని సంబంధిత యజమానులకు పంచాయతీరాజ్‌ శాఖ పంపిణీ చేస్తుంది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలోని 423 ఇళ్లు, 83 ఖాళీ స్థలాల యజమానులకు సోమవారం ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement