Revenue Survey
-
వైఎస్సార్–జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభం
-
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, జగ్గయ్యపేట : మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర) సాహసోపేత నిర్ణయం ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. భూ వివాదాలను చెరిపేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది. -
జనం ఆస్తికి అధికారిక ముద్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అలాగని అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులకు ఆ ఆస్తులతో ఎలాంటి ఇతర ప్రయోజనాలూ లభించడం లేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు. ఇంటి పన్ను వసూలుకు వీలుగా గ్రామ పంచాయతీల వద్ద ఇళ్ల యజమానుల జాబితాలు తప్ప ఆయా ఇళ్లకు సంబంధించి రికార్డులు, ఆస్తి వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వద్ద లేవు. దీంతో ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషుల మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండటం లేదు. దీనివల్ల సరైన రేటూ లభించడం లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఇబ్బందులే. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠంలో ఉండే అలాంటి ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ ‘క్యూఆర్ కోడ్’ (వివరాలు తెలుసుకునేందుకు ఉపకరించే ఆప్టికల్ లేబుల్)తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంలో భాగంగా సోమవారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ ► ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుంది. తద్వారా ఆస్తికి రక్షణ లభిస్తుంది. ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సహజంగానే ఆస్తి విలువ పెరిగిపోతుంది. ► ఇల్లు/ స్థలం అమ్ముకోవాలనుకుంటే.. నిర్దిష్ట ఆస్తి సర్టిఫికెట్ ఉండటంతో సులభంగా మార్పిడి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ ఆస్తి సర్టిఫికెట్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ సహాయంతో గ్రామ పంచాయతీ వద్ద ఉండే రికార్డులలో సంబంధిత కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కొత్త యజమానిపేరుతో పంచాయతీ కార్యదర్శి ఆస్తి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ► అలాగే ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్న సమయంలో.. పాత ఆస్తి సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పంపకంలో వచ్చిన వాటాల మేరకు అన్నదమ్ములకు వెంటనే కొత్త ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ► గ్రామాల్లో స్థలాల వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సులభంగా పరిష్కరించేందుకు కూడా వీలు కలుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇలా.. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల పరిధిలో గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న వాటితో సహా అన్ని ఇళ్లు, ఇతర స్థలాలన్నింటినీ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తించి, స్థానిక అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం విస్తీర్ణం, మూలలు, కొలతలు, ఇతర వివరాల నిర్ధారణతో రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. ► గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, స్థలాలకు కొత్తగా సర్వే నంబర్లు కూడా కేటాయిస్తారు. ప్రతి ఇంటినీ, ప్రతి స్థలాన్ని వేర్వేరు ఆస్తిగా పేర్కొంటూ వాటికి వేర్వేరుగా గుర్తింపు నంబర్లను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ► ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను (ధ్రువీకరణ పత్రాలు) తయారు చేసి (వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు) గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని సంబంధిత యజమానులకు పంచాయతీరాజ్ శాఖ పంపిణీ చేస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలోని 423 ఇళ్లు, 83 ఖాళీ స్థలాల యజమానులకు సోమవారం ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. -
రెవెన్యూ సర్వేలో ట్రైనీ ఐఏఎస్‌లు
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సర్వేను శుక్రవారం ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. మండల పరిధిలోని జూల్కల్లో జరుగుతున్న రెవెన్యూ సర్వేలో పాల్గొని రైతుల సమస్యలను వినడంతోపాటు ఎలా పరిష్కరిస్తున్నారో తహసీల్దార్ గోవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల సవరణ, ఫౌతి మార్పుల గురించి అధ్యయనం చేశా రు. స్వయంగా 1బీ ఫారాలను ట్రైనీ ఐ ఏఎస్‌లు నింపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రా మ సభల్లో సవరించిన రికార్డులను ఆ న్‌లైన్ చేసే విధానాన్ని తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు జితేష్ వి పాటిల్, రాహుల్‌రాజ్, గౌతంపోత్రూ,అనురాగ్ జయంతి, ప మేలా, ఆర్ఐ కార్తీక్, సర్పంచ్ మల్ల మ్మ, వీఆర్ఓలు శ్రీనివాస్, గంగాధ ర్, రాచయ్య తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన కౌన్సిల్
సర్వేపై పేలిన మాటల తూటాలు దర్గా భూములపై వెనక్కి తగ్గిన టీడీపీ 238 అంశాలపై చర్చ ఒక్కరోజులోనే పూర్తయిన సమావేశం మున్సిపల్ కమిషనర్ లేకుండానే కొనసాగిన కౌన్సిల్ విజయవాడ సెంట్రల్ : రెవెన్యూ సర్వే, దర్గా భూముల వ్యవహారంపై కౌన్సిల్లో పాలక, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. పురాతన భవనాలు, పింఛన్ల పంపిణీపై వాడీవేడిగా చర్చ సాగింది. యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందంటూ అన్ని పార్టీల సభ్యులు మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. సర్వే పేరుతో ప్రజల నెత్తిన భారాలు వేస్తే సహించమంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు ధ్వజమెత్తారు. ‘తాము పన్నులు పెంచడం లేదని, మీరు కలలు కంటే నేనేం చేయలేను..’ అంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్హాల్లో జరిగింది. ఉదయం 10.35కు సభ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 4 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ 6.20 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 8.15కు ముగిసింది. మొత్తం 238 అంశాలపై చర్చించారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈసారి మాత్రమే ఒక్కరోజులో సభ ముగిసింది. కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.వీరపాండ్యన్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లడంతో కౌన్సిల్‌కు హాజరుకాలేకపోయారు. సర్వేపై రసవత్తర చర్చ ఆస్తిపన్నులో తేడాలు, నీటి, డ్రెయినేజీ, ట్రేడ్ లెసైన్స్‌ల ఫీజుల వసూళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కాంప్రహెన్సివ్ రెవెన్యూ సర్వే నిర్వహించాలని అంజెండాలో కమిషనర్ జి.వీరపాండ్యన్ చేసిన ప్రతిపాద నపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య రసవత్తర చర్చ సాగింది. ప్రజలపై పన్ను భారాలు మోపేందుకే సర్వే అస్త్రం ప్రయోగిస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చందన సరేష్, గాదె ఆదిలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వారు సవరణ తీర్మానం ఇచ్చారు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ‘పన్నులు పెంచుతున్నారని మీకు ఎవరు చెప్పారు. పన్నులు ఎగ్గొట్టేవాళ్లకు మీరు(ప్రతిపక్షాలు) కొమ్ము కాస్తున్నారు..’ అంటూ మేయర్ ఆరోపించారు. కమ్యూనిస్టుల పాలనలో 1995లో సర్వే చేసి పన్నులు పెంచలేదా.. అని ప్రశ్నించారు. ఆదాయం వస్తే నగరం ఎక్కడ బాగుపడుతోందోనని ప్రతిపక్షాలు బాధ పడుతున్నాయని విమర్శించారు. మూడు డివిజన్లలో సర్వే నిర్వహిస్తే రూ.74 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.600 కోట్లు టార్గెట్ పెట్టి సర్వే చేస్తామంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చందన సురేష్ అన్నారు. ఓటింగ్ నిర్వహించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన సవరణ తీర్మానం సక్రమంగా లేదని, అందువల్ల ఓటింగ్ అవసరం లేదన్నారు. నగరంలో సమగ్ర సర్వే నిర్వహించే అధికారాన్ని కమిషనర్‌కు అప్పగిస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది. దర్గా భూములపై వెనక్కి తగ్గిన పాలకపక్షం దర్గా భూముల్లో గృహనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన విషయంలో పాలకపక్షం వెనక్కి తగ్గింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ఈ విషయమై అధికార పార్టీని గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్ద విచారణ పెండింగ్‌లో ఉండగా, గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దర్గా భూముల్లో అనుమతులు నిలుపుదల చేసే అధికారం కౌన్సిల్‌కు లేదంటూ వింతవాదన వినిపించారు. అదే పార్టీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దంటూ కౌంటర్ వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు అనుమతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని మేయర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. దర్గా భూముల వ్యవహరంలో ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే పాలకపక్షం వెనకడుగు వేసిందని సమాచారం. -
ఖమ్మం నడిబొడ్డున 5.30 ఎకరాల ఎన్నెస్పీ భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) భూములంటే అందరికీ అలుసే... గజం స్థలం కనిపించినా ఎవరికైనా ఆశే... అది ఖమ్మం అయినా.. నేలకొండపల్లి అయినా.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అయినా అదే పరిస్థితి. ఎన్నెస్పీ భూములు ఎక్కడున్నా ఎలా కబ్జా చేద్దామా అన్న ఆలోచనే.. అదే కోవలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఎన్నెస్పీ క్యాంపులో రూ.50 కోట్ల విలువైన దాదాపు ఆరెకరాల భూమి కబ్జాకు గురయింది. ఇది ఎవరో లెక్కలు కట్టిందో... అంచనాలు వేసిందో కాదు... స్వయంగా ఆ శాఖ అధికారులు జరిపిన సర్వేలో వెల్లడైన వాస్తవం. ఎన్నెస్పీ క్యాంపులో ఉన్న మొత్తం 94 ఎకరాలలో ఈ ఆరెకరాల భూమి కబ్జా అయినట్టు తేలింది. జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడయిన వివరాలను ఎన్నెస్పీ అధికారులు త్వరలోనే రెవెన్యూ శాఖకు పంపనున్నారు. మొత్తం భూమిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీలు, ఇతర సంస్థలకు కేటాయించిన భూమి పోను మరో 52 ఎకరాలు ఉందని, అందులో 11 ఎకరాలు తమ ఆధీనంలో ఉంచి, మిగిలినది స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖకు రాయాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా.. భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉన్నా... అధికారులు జరిపిన ప్రాథమిక సర్వేలోనే ఇంత కబ్జా భూమి వెలుగులోకి వస్తే... నిజంగా రెవెన్యూ శాఖ కొలతలు వేసి సర్వే చేస్తే ఇంకెంత తేలుతుందో చూడాలి. 94 ఎకరాలు... 40 ఏళ్ల క్రితం సేకరణ నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాకు విస్తరించే పనుల్లో భాగంగా ఇక్కడ పనులు చేసేందుకు అవసరమనే ఆలోచనతో 1975- 76 సంవత్సరాల్లో ఖమ్మం నగరంలో మొత్తం 94 ఎకరాల భూమిని ఎన్నెస్పీ అధికారులు తీసుకున్నారు. 87-98, 100, 101, 275 సర్వే న ంబర్లలోని ఈ భూమిని రెవెన్యూ శాఖ భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి సేకరించి ఎన్నెస్పీకి అప్పగించింది. అందులో 42 ఎకరాల్లో వివిధ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, దేవాలయాలు, చర్చిలు, ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 52 ఎకరాల్లో ఎన్నెస్పీ సిబ్బందికి క్వార్టర్లు, ఎస్ఈ క్యాంపు ఆఫీసు, డీఈ, ఈఈ కార్యాలయాలున్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూముల వివరాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అసలు ఎంత భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారనే దానిపై ఎన్నెస్పీ దృష్టి సారించింది. అందులో 5.30 ఎకరాలు కబ్జాకు గురయినట్టు ప్రాథమికంగా తేలింది. మొత్తం 84 మంది ఆధీనంలో ఈ కబ్జా భూమి గత కొన్నేళ్లుగా ఆక్రమించినట్టు సమాచారం. వీరి జాబితా కూడా ఎన్నెస్పీ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇంతకాలం ప్రైవేటు వ్యక్తులు దర్జాగా భూములు ఆక్రమించినా.. వారిపై ఎన్నెస్పీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కబ్జా కథల వెనుక ఎన్నెస్పీ అధికారుల ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. ఈ భూమి మాకొద్దు బాబోయ్... ఎన్నెస్పీ స్థలాల నిర్వహణ భారం తప్పించుకునేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ భూములు ఇష్టారాజ్యంగా ఆక్రమించడం... తమదేనంటూ కోర్టులకెళ్లడం... కొంతమంది ఏకంగా అమ్మేసుకోవడం వంటివి జరగడంతో ఎన్నెస్పీ అధికారులు ఈ భూములను వదిలించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత సర్వే నివేదికను రెవెన్యూ శాఖకు పంపే సమయంలోనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖను కోరనున్నారు. తమ సిబ్బంది క్వార్టర్లు ఎలాగూ శిథిలావస్థకు చేరుకున్న దశలో కొత్త క్వార్టర్లతో పాటు ఎస్ఈ క్యాంపు ఆఫీసుతో పాటు డీఈ, ఈఈ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 11 ఎకరాలు సరిపోతుందని, ఆ భూమిని తీసుకుని మిగిలిన భూమిని రెవెన్యూ శాఖకే అప్పజెపుతామని ఆ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో క్వార్టర్ల కింద తీసుకున్న నివాసాలను ఖాళీ చేయని రాజకీయ నాయకులకు కూడా త్వరలోనే నోటీసులు పంపాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు ఎన్నెస్పీ ప్రధాన కాల్వపై ఉన్న భూములను కూడా సమగ్ర సర్వే జరపనున్నారు.