సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) భూములంటే అందరికీ అలుసే... గజం స్థలం కనిపించినా ఎవరికైనా ఆశే... అది ఖమ్మం అయినా.. నేలకొండపల్లి అయినా.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అయినా అదే పరిస్థితి. ఎన్నెస్పీ భూములు ఎక్కడున్నా ఎలా కబ్జా చేద్దామా అన్న ఆలోచనే.. అదే కోవలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఎన్నెస్పీ క్యాంపులో రూ.50 కోట్ల విలువైన దాదాపు ఆరెకరాల భూమి కబ్జాకు గురయింది.
ఇది ఎవరో లెక్కలు కట్టిందో... అంచనాలు వేసిందో కాదు... స్వయంగా ఆ శాఖ అధికారులు జరిపిన సర్వేలో వెల్లడైన వాస్తవం. ఎన్నెస్పీ క్యాంపులో ఉన్న మొత్తం 94 ఎకరాలలో ఈ ఆరెకరాల భూమి కబ్జా
అయినట్టు తేలింది. జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడయిన వివరాలను ఎన్నెస్పీ అధికారులు త్వరలోనే రెవెన్యూ శాఖకు పంపనున్నారు. మొత్తం భూమిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీలు, ఇతర సంస్థలకు కేటాయించిన భూమి పోను మరో 52 ఎకరాలు ఉందని, అందులో 11 ఎకరాలు తమ ఆధీనంలో ఉంచి, మిగిలినది స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖకు రాయాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా.. భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉన్నా... అధికారులు జరిపిన ప్రాథమిక సర్వేలోనే ఇంత కబ్జా భూమి వెలుగులోకి వస్తే... నిజంగా రెవెన్యూ శాఖ కొలతలు వేసి సర్వే చేస్తే ఇంకెంత తేలుతుందో చూడాలి.
94 ఎకరాలు... 40 ఏళ్ల క్రితం సేకరణ
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాకు విస్తరించే పనుల్లో భాగంగా ఇక్కడ పనులు చేసేందుకు అవసరమనే ఆలోచనతో 1975- 76 సంవత్సరాల్లో ఖమ్మం నగరంలో మొత్తం 94 ఎకరాల భూమిని ఎన్నెస్పీ అధికారులు తీసుకున్నారు. 87-98, 100, 101, 275 సర్వే న ంబర్లలోని ఈ భూమిని రెవెన్యూ శాఖ భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి సేకరించి ఎన్నెస్పీకి అప్పగించింది.
అందులో 42 ఎకరాల్లో వివిధ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, దేవాలయాలు, చర్చిలు, ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 52 ఎకరాల్లో ఎన్నెస్పీ సిబ్బందికి క్వార్టర్లు, ఎస్‌ఈ క్యాంపు ఆఫీసు, డీఈ, ఈఈ కార్యాలయాలున్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూముల వివరాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అసలు ఎంత భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారనే దానిపై ఎన్నెస్పీ దృష్టి సారించింది. అందులో 5.30 ఎకరాలు కబ్జాకు గురయినట్టు ప్రాథమికంగా తేలింది.
మొత్తం 84 మంది ఆధీనంలో ఈ కబ్జా భూమి గత కొన్నేళ్లుగా ఆక్రమించినట్టు సమాచారం. వీరి జాబితా కూడా ఎన్నెస్పీ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇంతకాలం ప్రైవేటు వ్యక్తులు దర్జాగా భూములు ఆక్రమించినా.. వారిపై ఎన్నెస్పీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కబ్జా కథల వెనుక ఎన్నెస్పీ అధికారుల ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు సైతం లేకపోలేదు.
ఈ భూమి మాకొద్దు బాబోయ్...
ఎన్నెస్పీ స్థలాల నిర్వహణ భారం తప్పించుకునేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ భూములు ఇష్టారాజ్యంగా ఆక్రమించడం... తమదేనంటూ కోర్టులకెళ్లడం... కొంతమంది ఏకంగా అమ్మేసుకోవడం వంటివి జరగడంతో ఎన్నెస్పీ అధికారులు ఈ భూములను వదిలించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత సర్వే నివేదికను రెవెన్యూ శాఖకు పంపే సమయంలోనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖను కోరనున్నారు.
తమ సిబ్బంది క్వార్టర్లు ఎలాగూ శిథిలావస్థకు చేరుకున్న దశలో కొత్త క్వార్టర్లతో పాటు ఎస్‌ఈ క్యాంపు ఆఫీసుతో పాటు డీఈ, ఈఈ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 11 ఎకరాలు సరిపోతుందని, ఆ భూమిని తీసుకుని మిగిలిన భూమిని రెవెన్యూ శాఖకే అప్పజెపుతామని ఆ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో క్వార్టర్ల కింద తీసుకున్న నివాసాలను ఖాళీ చేయని రాజకీయ నాయకులకు కూడా త్వరలోనే నోటీసులు పంపాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు ఎన్నెస్పీ ప్రధాన కాల్వపై ఉన్న భూములను కూడా సమగ్ర సర్వే జరపనున్నారు.
ఖమ్మం నడిబొడ్డున 5.30 ఎకరాల ఎన్నెస్పీ భూమి కబ్జా
Published Sat, Jul 19 2014 2:54 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement