సాగర్ ఎడమ కాల్వ ఇక మూడు సర్కిళ్లు!
- ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్
- జిల్లాలోని ఆయకట్టు ప్రకారం కార్యాలయాల ఏర్పాటు
- డేటా నమోదు చేస్తున్న ఎన్నెస్పీ అధికారులు
- నీటిసంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు
ఖమ్మం : ఇప్పటి వరకు ఒక రాష్ట్రం.. ఒకే కాల్వగా ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఇక నుంచి రెండు రాష్ట్రాలు.. మూడు ముక్కలుగా మారబోతోంది. జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సాగర్ ఎడమకాల్వ పరిధిలోని రెండు రాష్ట్రాల ఆయకట్టును కూడా విడగొట్టారు. దీని ప్రకారం కాల్వలను, సిబ్బందిని, కార్యాలయాలను సైతం కేటాయించారు. ఆ పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.
ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో సైతం ఆయకట్టును విడగొట్టి ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్‌గా మార్చబోతున్నారు. అంటే ఖమ్మం, నల్లగొండ, కృష్ణా మూడు జిల్లాల్లో మూడు సర్కిళ్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు ఆ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ప్రకారం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అవసరమైన నివేదిక కోసం ఆయకట్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్యాలయాల డేటాను నమోదు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎన్నెస్పీ టేకులపల్లి (ఖమ్మం) ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈలు, డీఈలతో పాటు సిబ్బంది లెక్కలు తీశారు.
జిల్లాలో ఒకే సర్కిల్...
ఎన్నెస్పీ కెనాల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు టేకులపల్లి సర్కిల్ పేరుతో (ఖమ్మం) కార్యాలయం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని కొంత ఆయకట్టు, కృష్ణా జిల్లాలోని కొంత ఆయకట్టు.. ఇలా మూడు జిల్లాల పరిధిలోని 5 లక్షల 49 వేల 296 ఎకరాల భూమి ఈ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇప్పుడు జిల్లాల వారీగా సర్కిల్ మార్పులతో ఖమ్మం పరిధిలో 2 లక్షల 51 వేల 800 ఎకరాల ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలోని 20,681 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని 2 లక్షల 70 వేల ఎకరాలు ఖమ్మం పరిధిలో ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఆయా జిల్లాల సర్కిల్ పరిధిలోకి వెళ్లనున్నాయి.
ఇక గతంలో నూజివీడు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా ఆయకట్టు 13,994 ఎకరాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలవనుంది. ఈ ఆయకట్టు ఖమ్మం జిల్లాకు చెందినప్పటికీ జోన్-3 పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని జోన్-2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జోన్-2 పరిధిలోకి వచ్చే భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు రూ.20 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్రం విడిపోకముందే ప్రభుత్వానికి అందించారు.
జిల్లాలో మొత్తం ఆయకట్టును ఒకే సర్కిల్ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. గతంలో కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో కలిసి ఉన్న ఆయకట్టుకు సెక్షన్ కార్యాలయాలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోవడంతో జిల్లా ఆయకట్టును మినహాయించి అటువైపు ఉన్న ఎనిమిదో సెక్షన్, ఒక సబ్‌డివిజన్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు.
జిల్లాలో మరో మానిటరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం?
జిల్లాలో ఉన్న ఆయకట్టు ప్రకారం 750 నుంచి1200 ఎకరాలకు ఒక సెక్షన్, 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు ఒక సబ్ డివిజన్, లక్ష నుంచి లక్షా 50 వేల ఎకరాలకు ఒక డివిజన్ కార్యాలయాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను సైతం ఇదే తరహాలో తయారు చేయబోతున్నారు. దీంతో గతంలో ఉన్న నీటి సంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఇప్పటి వరకు ఎడమకాల్వ మొత్తానికి మానిటరింగ్ డివిజన్ కార్యాలయం ఖమ్మంలోనే ఉంది. దాని పరిధిలోనే ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలు (మిర్యాలగూడెం, హూజూర్‌నగర్, నాయకన్‌గూడెం, టేకులపల్లి, తిరువూరులలో) ఉన్నాయి. రాష్ట్రం విడిపోవడంతో తిరువూరు సబ్ డివిజన్‌ను జగ్గయ్యపేటలో విలీనం చేశారు. దాని స్థానంలో ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే నీటి పర్యవేక్షణతో పాటు పరిపాలన పరంగా వెసులుబాటు ఉంటుందని, దాని ప్రకారమే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులు చెబుతున్నారు.