సొమ్ముపోయె... గూడూ పోయె... | money and house both gone | Sakshi
Sakshi News home page

సొమ్ముపోయె... గూడూ పోయె...

Published Tue, Feb 4 2014 3:14 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

money and house both gone

 అధికారులు ఇళ్లు కూల్చివేయడంతో... మోసపోయామంటున్న నిర్వాసితులు
 పోలీస్‌స్టేషన్‌కు పరుగులు
  ఇంటి రుణాలు తీర్చాలని బ్యాంకర్ల ఒత్తిడి
 
  ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ :
 కోర్టు ఆదేశాల పేరుతో ఖమ్మం సమీపంలోని నాగార్జునసాగర్ కాల్వ కట్టపై నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించగా...ఇప్పుడు అనేక ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అందులో పలు ప్లాట్లను కొందరు పెద్దలు ఆక్రమించి ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. వాటికి పక్కాగా రిజిస్ట్రేషన్ ఉందనే ధైర్యంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు అధికారులు ఆ ఇళ్లన్నీ కూల్చివేయడంతో తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే.. మోసం చేసినవారు ఎంతటి వారైనా సరే కేసు నమోదు చేస్తామని స్వయానా కలెక్టర్, ఎస్పీ ప్రకటించడంతో స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఖానాపురం హవేలీ, వన్‌టౌన్, త్రీటౌన్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు.
 
 రియల్టర్ల మోసాలకు బలి..!
 అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాల్వ భూములను అందినంత ఆక్రమించుకోవడంతో పాటు దాని పక్కనున్న పట్టా భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత అంతా కలిపి ప్లాట్లు చేసి విక్రయించారు. పహణీలో పట్టా భూమిగానే ఉండడంతో సొంతింటి కల నిజం చేసుకుందామనే ఆశతో పలువురు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. తీరా ఇళ్లు నిర్మించుకుని, కొంత కాలం నివాసం ఉన్న తర్వాత ఇప్పుడు అధికారులు వచ్చి ఇది ఆక్రమిత భూమి అంటూ కూల్చివేయడంతో వారు లబోదిబోమంటున్నారు. మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతులు, పక్కాగా ఇంటి నంబర్లు, పంపు కనెక్షన్లు, రిజిస్ట్రేషన్‌లు ఉండడంతో నమ్మి మోసపోయామని విలపిస్తున్నారు. ఈ ఆక్రమణలను అధికారులు ఆదిలోనే గమనించి అరికట్టి ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావంటున్నారు. కాగా, ప్లాట్ డాక్యుమెంట్లు తనఖా పెట్టుకుని ఇంటి నిర్మాణానికి రుణాలిచ్చిన బ్యాంకర్లు.. ఇళ్లు కూల్చిన విషయం తెలియగానే అప్పులు చెల్లించాలంటూ వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో పాటు తమకు ష్యూరిటీగా ఉన్నవారిపై కూడా ఒత్తిడి తెస్తున్నారని చెపుతున్నారు. ఒకవైపు ఇళ్లు, స్థలాలు కోల్పోయి మానసికంగా కుంగిపోయిన తమపై బ్యాంకు అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందుతున్నారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
 
 నాలుగైదు చేతులు మారి...
 ఇందిరానగర్, మధురానగర్, పార్శిబంధం, ముస్తాఫానగర్ , గొల్లగూడెం రోడ్డులో అనేక గుడిసెలతో పాటు పక్కా భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. వాటిలో కొందరు ప్లాట్లు కొని ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు నిర్మితమైన ఇళ్లనే కొనుగోలు చేసి మోసపోయారు. ఒక్కో ఇల్లు నలుగురైదుగురు చేతులు మారినవి కూడా ఉన్నాయి. ఇలా.. తమకు అమ్మినవారు మోసం చేశారంటూ ఒక్కో ఇంటికి సంబంధించి నాలుగైదు ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం కూడా ఖానాపురం హవేలీ స్టేషన్‌లో హన్మంతరావు, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు మధ్య ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement