స్వయం ఉపాధి సున్నా... | Unemployed be in concern | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి సున్నా...

Published Mon, Nov 3 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

Unemployed be in concern

ఖమ్మం హవేలి : జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 2013 - 14 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ పైసా సబ్సిడీ రాలేదు. కార్పొరేషన్‌ల లక్ష్యం ‘0’ వద్దే నిలిచిపోయింది. 2014 - 15 ఆర్థిక సంవత్సరం సైతం ముగిసిపోయే దశకు చేరుకుంది.

గత ఏడాది దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు వెళ్లిన వారికే ఇప్పటి వరకు సబ్సిడీలు విడుదల కాకపోవడంతో బ్యాంకర్లు ఈ ఆర్థిక సంవత్సరం రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014 - 15 ఏడాదికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో ఇంటర్వ్యూలకు హాజరైన వారు తమకు ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు  ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అయినా  2014-15కు  సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఊసే లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇంటర్వ్యూలకు ఎంపికైనవారు తమకు ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు రావేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పథకం అమలులో భాగంగా లక్ష్యం ఇప్పటివరకు నిర్ణయించకపోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాన్ని ప్రస్తుత కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందేమోనని వాపోతున్నారు. ఇక పోలవరం ముంపు కింద సీమాంధ్రలో కలిసిన మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.4కోట్ల వరకు నిరుద్యోగులకు సబ్సిడీ నిలిచిపోయింది. యూనిట్ల గ్రౌండింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది.

 సంవత్సరమంతా నిర్లక్ష్యం..  చివర్లో నిరుద్యోగులపై ఒత్తిడి
 బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 2013-14 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలోని 46మండలాల్లో 2,457 యూనిట్లకు రుణాలిచ్చేలా లక్ష్యం నిర్దేశించింది. ఇందులో రూ.20వేల యూనిట్లు 544, రూ.25వేల యూనిట్లు 927, రూ.30వేల యూనిట్లు 895, రూ.50వేల యూనిట్లు 57, రూ.1లక్ష విలువైన యూనిట్లు 34 ఇవ్వాల్సి ఉంది. అయితే మొత్తం 2,457 యూనిట్లకు గాను వీటిలో 801 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయి.

అదేవిధంగా జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో 530 యూనిట్ల లక్ష్యం నిర్ధేశించబడింది. ఇందులో రూ.20వేల యూనిట్లు 149, రూ.25వేల యూనిట్లు 184, రూ.30వేల యూనిట్లు 184, రూ.50వేల యూనిట్లు 5, రూ.1లక్ష విలువైన యూనిట్లు 8 వ్వాల్సి ఉంది. కాగా వీటిలో 150 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. సంవత్సరం మొత్తం వృథా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2013 అక్టోబరులో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోగా 2014 ఫిబ్రవరి వరకు అధికారులు వారిని పిలువలేదు.

 జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు నెలల తరబడి ఆలస్యం జరిగింది. అప్పటివరకు నిర్లక్ష్యం చేసి తీరా సార్వత్రిక ఎన్నికల కోడ్‌కు 10రోజుల ముందు పిలిచి హడావుడి చేయడంతో నిరుద్యోగులు అనేక అవస్థలు పడ్డారు. చివరకు బ్యాంకర్లు కాన్సెంట్లు ఇవ్వడంలో విముఖత చూపడంతో లక్ష్యానికి సుదూరంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు మంజూరు కాకపోవడం ఇందుకు నిదర్శనం.


 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల్లో మొత్తం 1323 మంది నిరుద్యోగులకు 763 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం నిర్ధేశించగా 660 మందికి 652 యూనిట్లు మంజూరు అయ్యాయి. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో 2302 మందికి 1292 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం ఉండగా 771 మందికి 763 యూనిట్లు మంజూరు అయ్యాయి.
 ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు మంజూరైన నిరుద్యోగులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల వివరాల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయలేదు.

ఎన్నికల అనంతరం లబ్థిదారుల ఖాతాల వివరాలను ఆన్‌లైన్ చేసి పంపించారు. ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 5నెలలు అయినప్పటికీ 2013-14కు సంబంధించి సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేదు. సబ్సిడీ కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఇక 2014-15 సంవత్సరానికి పథకానికి సంబంధించి లక్ష్య సాధన ఊసే లేకుండా పోయింది. కొత్త రాష్ట్రం వచ్చిన తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టే ఆలోచన చేసినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఎంపికైన తమకు సబ్సిడీ మంజూరు చేసి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా చేయూతనివ్వాలని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement