ముత్యాల సాగర్ (ఫైల్)
ఖమ్మం క్రైం: ‘తల్లిదండ్రులు కూలికి వెళ్లి సంపాదించిన డబ్బులతో కోచింగ్ సెంటర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఇంకా ఎంతకాలం పోషిస్తారు. తెలంగాణలో ఇగ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావేమో... పిచ్చిలేస్తోంది’అని ఆందోళన చెందిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్(23) ఖమ్మం మామిళ్లగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఏ పూర్తిచేశాడు.
అక్కడే ఎన్‌సీసీలో చేరి ‘సీ’సర్టిఫికెట్ సాధించాడు. తల్లిదండ్రులు భద్రయ్య, కళమ్మ దినసరి కూలీలు. ఇటీవలే సాగర్ సోదరికి వివాహమైంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో సాగర్ ఎస్సై, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ స్నేహితులతో కలసి అద్దెగదిలో ఉంటున్నాడు. సంక్రాంతి తర్వాత స్వగ్రామం నుంచి ఖమ్మం వచ్చిన సాగర్ సోమవారం అర్ధరాత్రి దాటాక తన గది సమీపాన రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు తన సెల్‌ఫోన్ వాట్సాప్ స్టేటస్‌లో ‘ఇగ నోటిఫికేషన్లు రావు... పిచ్చి లేస్తోంది’అని పెట్టాడు. మంగళవారం ఉదయం స్థానికులు సాగర్ మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద లభించిన పాన్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రవికుమార్ సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, సభ్యుల సాయంతో మార్చురీకి తరలించారు.
సాగర్ మృతదేహాన్ని భద్రపరిచిన జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద పలు పార్టీలు ఆందోళన చేశాయి. ఆత్మహత్యకు కేంద్రప్రభుత్వం కూడా కారణమేనంటూ న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించడంతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని బయ్యారం తరలించారు. కాగా, సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బయ్యారంలోని ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై న్యూడెమోక్రసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతోపాటు పలు కులసంఘాలు రాస్తారోకో చేశాయి. దీంతో దహనస్కారాలు పూర్తి అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఉద్యోగం లేకపోతేనే, మేం సాద్దుము కొడుకా..
బయ్యారం: ‘మా కడుపున పుట్టిన నీవు మమ్ముల్ని సాదుతావు అనుకున్నాం కొడుకా... ఉద్యోగం లేకున్నా.. నాన్న, నేను రెక్కల కష్టంతో చెల్లిని, నిన్ను పెంచి పెద్ద చేశాం. ఉద్యోగం చేయమని మేం అడిగామా... నీకు ఉద్యోగం లేకున్నా మేం సాద్దుము.. మేం ఎవరి కోసం బతకాలి కొడుకా.. మమ్ముల్ని ఎందుకు అన్యాయం చేశావు నాయనా’అంటూ సాగర్ తల్లి కళమ్మ విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment