టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. (ఆంధ్రప్రదేశ్ మాల్యా... సుజనా!)
అసలేం జరిగిందంటే..
బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన సుజనా ఢిల్లీ ధర్మాసనం తీర్పుతో కంగు తిన్నారు. (బ్యాంకులకు కుచ్చుటోపీ: సుజనాకు ఈడీ షాక్..)
Comments
Please login to add a commentAdd a comment