- కార్యాచరణ ప్రణాళిక లేని ఎస్సీ కార్పొరేషన్
- 45 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
- ఈ లోగా లబ్ధిదారుల ఎంపిక అసాధ్యం !
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు ఉంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి.. నిండుగా నిధులున్నా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) మరో నెలన్నరలో ముగియనుంది కానీ, ఇప్పటివరకు రాష్ట్ర షెడ్యూల్ కులాల కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికే (యాక్షన్‌ప్లాన్) ఇంకా సిద్ధం కాలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలన్నీ స్తంభించాయి.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరిగి నెలలు గడిచినా, నామమాత్రంగానే కార్యక్రమాలు సాగుతున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తే లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకుల లింకేజీ, రుణాల మంజూరు జరిగేవి. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం చెబుతున్నా.. సీఎం కేసీఆర్ ఈ శాఖను నిర్వహిస్తున్నా.. ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు గత ఏడాది లబ్ధిదారులను ఎంపిక చేసినా వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా మంజూరు కూడా ఇవ్వకపోవడంతో అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు ఉండడంతో, కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం కాని పరిస్థితుల్లో నెలన్నర వ్యవధిలోనే ఇది ఏ మేరకు సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎస్టీ, బీసీ ప్లాన్లు వెలువడినా అమలు కష్టమే?
మరోవైపు ఎస్టీ,బీసీ కార్పొరేషన్లు,ఫెడరేషన్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనా.. రెండు నెలల్లోనే గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. దీనిని అమలు చేసేందుకు సిబ్బంది కూడా తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 42 వేల మందిని, ఫెడరేషన్ల ద్వారా 62 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.