ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే బ్యాంకు రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని మేడ్చల్ ఎంపీడీఓ దేవసహాయం అన్నారు.
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ ద్వారా అందించే బ్యాంకు రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని మేడ్చల్ ఎంపీడీఓ దేవసహాయం అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ ద్వారా అందించే వివిధ పథకాల రుణాలకు సంయుక్త లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ... గ్రామాల్లోని నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపికచేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 30 వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు శైలజ మాట్లాడుతూ... గ్రామాల్లో నిరుపేదలకు రుణాలను సకాలంలో అందించి వారిని ఆదుకునే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.