కౌలు రైతుకు ‘భరోసా’
రుణ అర్హత కార్డులు జారీ!
- కొత్తవి, రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోండి
- మీ సేవ కేంద్రాల ద్వారా కార్డుల జారీ
- ఆధార్‌తో అనుసంధానం
- పట్టా భూముల యజమానులతో సమానంగా లబ్ధి
- ఙ్ట్చఛగ్రామ గ్రామాన అవగాహన సదస్సులు
జోగిపేట: ప్రభుత్వం కౌలు రైతుకు భరోసానిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వీరందరికీ బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్‌ఈసీ)లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే జిల్లాలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ కానున్నాయి.
పట్టా భూమి కలిగి ఉన్న రైతులు ప్రభుత్వం నుంచి పొందుతున్న అన్ని సదుపాయాలు కౌలు రైతుకూ వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది. పట్టాదారులకు తప్ప ఆ భూమిలో కౌలు చేస్తున్న రైతులకు పంట రుణాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కార్డులను జారీ చేయనుంది. ఈ రుణ అర్హత కార్డులను ఆధార్‌తో అనుసంధానిస్తారు. దీంతో బ్యాంకు రుణాలు, రాయితీ విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, వివిధ రాయితీలు ఇకపై కౌలు రైతులకూ అందనున్నాయి. మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరనూ పొందవచ్చు. ప్రకృతి విపత్తులు, వ్యవసాయ పరికరాల లోపం వల్ల పంట నష్టపోతే బీమా పరిహారాన్నీ పొందవచ్చు. కార్డు పొందిన నాటి నుంచి మే 31 వరకు అది చెల్లుబాటులో ఉంటుంది.
మీ సేవ ద్వారా..
కౌలు రైతులకు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. వీటిని పొందాలనుకునే వారు, పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకునే వారి కోసం దరఖాస్తులను మీ సేవ కేంద్రాలు, గ్రామ, మండల రెవెన్యూ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు ఆధార్, రేషన్, ఓటరు, పాన్‌కార్డు నంబర్లలో ఏదో ఒకటి నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. నిర్దారణ తర్వాత 15 రోజుల్లో కొత్తవి, పునరుద్ధరణ కార్డులను జారీ చేస్తారు.
అవగాహన సదస్సులు..
జిల్లాలో రెండేళ్ల క్రితం 2070 మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 935 మంది బ్యాంకు రుణాలు పొందినట్లు సమాచారం. గత ఏడాది రుణ అర్హత కార్డులు పొందిన వారు వాటిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి చెల్లుబాటవుతాయి. కాగా, వివిధ ప్రయోజనాలు కల్పించిన రీత్యా ఈసారి రుణ అర్హత కార్డులు పొందే కౌలు రైతుల సంఖ్య పెరగనుంది. అలాగే, కౌలు రైతులకు కలిగించనున్న ప్రయోజనాలపై గ్రామ గ్రామాన రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ఆర్‌ఐ, వీఆర్‌ఓలు గ్రామసభలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
2013-14లో రూ.447 లక్షల రుణాలు
2013-14లో జిల్లాలో 2070 మంది కౌలు రైతులకు అర్హత కార్డులను పంపిణీ చేశాం. వీరిలో 935 మంది వివిధ బ్యాంకుల ద్వారా రూ.447 లక్షల మేర రుణాలను పొందారు. 2014-15లో రుణ అర్హత కార్డుల్ని రెన్యువల్ చేయక, రుణాలు ఇవ్వలేదు. 2015-16 సంవత్సరానికి కౌలు రైతుల రుణ అర్హత కార్డుల రెన్యువల్‌కు నిర్ణయించాం. మీసేవ కేంద్రాల ద్వారా వీటిని జారీ చేస్తాం.
- జేడీఏ హుక్యానాయక్,
వ్యవసాయశాఖ