
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమంలో గత సర్కారుకు ఇప్పటి సర్కారుకు స్పష్టమైన తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు కావాలంటే సిఫార్సులతో పాటు దళారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, పలుకుబడి గల వ్యక్తుల చుట్టూ ఉండే వారికే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేవి. గత ప్రభుత్వంలో లక్ష మంది ఎస్సీ, ఎస్టీలకు కూడా రుణాలు ఇవ్వలేదు. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో పాటు ఇతర పథకాల ద్వారా సెప్టెంబర్ ఆఖరు వరకు ఏకంగా 1.35 కోట్ల మందికి (1.06 కోట్లు ఎస్సీలు, 29.50 లక్షల మంది ఎస్సీలు) లబ్ధి చేకూర్చింది.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం అర్హతే ప్రామాణికంగా గత 16 నెలల్లో వైఎస్సార్ నవశకం పేరుతో వలంటీర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి నవరత్నాల గురించి వివరించి, దరఖాస్తులు తీసుకుని, లబ్ధి చేకూర్చారు.
► గత సర్కారు ఈ వర్గాలను బ్యాంకు రుణాలకే పరిమితం చేయగా, ఈ సర్కారు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత మెరుగైన జీవనం సాగించాలనే లక్ష్యంతో ఆయా పథకాలకు సంబంధించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసింది.
► గత సర్కారులో ఎస్సీ ,ఎస్టీల్లోని చిన్న, సన్న కారు రైతులకు రుణాలు అందేవి కాదు. అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 4,54,984 మంది ఎస్సీ రైతులు, 2,77,310 మంది ఎస్టీ రైతులకు లబ్ధి కలిగించింది.
సంక్షేమం అంటే ఇలా ఉండాలి
గతంలో సంక్షేమం అంటే దళారుల హవా ఉండేది. వారి సంక్షేమం కాగితాల్లోనే కనిపించేది. ఇన్నోవా కార్లు, పలుకుబడి ఉన్న వారికే లబ్ధి కలిగించారు. ఎస్సీ హాస్టల్స్ మూసి వేసిన ఘనత చంద్రబాబుది. ఆయన హయాంలో ఆరువేల స్కూళ్లు మూసేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధమైన సంక్షేమం లేదు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతోంది. సంక్షేమం అంటే ఇది.
– కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షుడు, ఐక్య దళిత మహానాడు
ఇంతగా సాయం అందడం ఇదే మొదటిసారి
ఇప్పటి వరకు గిరిజనులకు నేరుగా ఏ ప్రభుత్వం కూడా సాయం అందించలేదు. పలుకుబడి ఉన్నవారే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళారులు అసలే లేరు. సీఎం వైఎస్ జగన్ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. అన్ని పథకాలకు సంబంధించి నేరుగా సాయాన్ని బ్యాంకు అకౌంట్‌లో వేస్తుండటం ఇదే ప్రథమం. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు.
– ఆరిక సూర్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రైబల్ డెవలప్‌మెంట్ మిషన్
Comments
Please login to add a commentAdd a comment