లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి బొత్స, అధికారులు
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకులు పెద్దఎత్తున రుణ సదుపాయాన్ని కల్పిస్తుండటంతో ఓటీఎస్ వినియోగించుకునేవారికి మరింత మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిళ్లు పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కనిష్టంగా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేస్తోంది. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందజేయడంతోపాటు పథకంపై సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ – ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ వి. బ్రహ్మానందరెడ్డి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టి. కామేశ్వరరావు, ఆ బ్యాంకు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
న్యాయ వివాదాలు లేకుండా స్థిరాస్తి
గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన ఈ లబ్ధిదారులు ఓటీఎస్ కింద కేవలం రూ.20 వేలు చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఈ ఆస్తిని మళ్లీ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 లక్షలు చొప్పున రుణం పొందారు. వారి కుటుంబాలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ. బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటీఎస్ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం సంతోషకరం.
రిజిస్ట్రేషన్ చార్జీలు.. స్టాంపు డ్యూటీ లేదు
రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయించడం వల్ల ఒక్కో లబ్ధిదారుడికి రూ.15 వేల చొప్పున ప్రయోజనం చేకూరుతోంది. ఓటీఎస్ పథకం ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా స్టాంపు డ్యూటీ మినహాయింపు ద్వారా ఇప్పటివరకు మరో రూ.1,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. పేదల జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయి. వారి జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. ఓటీఎస్ లబ్ధిదారులకు నిర్ణీత కాలంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు రుణాలు అందేలా చూడాలి. ఈ సదుపాయాన్ని అంతా వినియోగించుకోవాలి.
భావి తరాలకు చక్కటి పునాదులు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుల ఆస్తికి క్లియర్ టైటిల్స్ ఇవ్వడం అభినందనీయం. సీఎం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు తరాలకు మంచి పునాదులు వేస్తున్నాయి. అధిక వడ్డీల బారిన పడకుండా మా బ్యాంకు సహకారం అందిస్తోంది. ముఖ్యమంత్రి పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఇది లబ్ధిదారుల జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది. ఇవాళ నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రూ.11,75,000 రుణాలను అందచేస్తున్నాం. నాలుగు జిల్లాల్లో 228 బ్రాంచీలున్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు మా బ్యాంకు బ్రాంచీలను సంప్రదిస్తే రుణసేవలు అందిస్తాం.
– టి.కామేశ్వర్రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్
పేదలకు ఎంతో ప్రయోజనం
ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోంది. గతంలో డాక్యుమెంట్లు, తగిన సెక్యూరిటీ లేక రుణాల మంజూరులో సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా ప్రభుత్వం క్లియర్ టైటిల్స్‌తో ఇస్తోంది. బ్యాంకులకు ఇది గొప్ప అవకాశం.
– వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment