తాడేపల్లిగూడెం రూరల్(ప.గో. జిల్లా): కొత్తగా పెళ్లయిన పేదలకు 90 రోజుల స్కీంలో ఇళ్ళ పట్టాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన నివాసం వద్ద పెదతాడేపల్లి గ్రామానికి చెందిన 24మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, నిర్మాణాలు చేపట్టారన్నారు. రాబోయే రెండేళ్ళల్లో మరో 23 లక్షల ఇళ్ళు కట్టించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారన్నారు. పెదతాడేపల్లి గ్రామంలో రెండో దఫా 24 మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నట్టు తెలిపారు.
పేదల సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. పెదతాడేపల్లిలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారని, దోచుకోవడానికి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేయాలనేది వారి ఆలోచనగా పేర్కొన్నారు. దుర్మార్గుల కళ్ళు తెరిపించేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే సీఎం జగన్‌కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, వీఆర్వో ఆర్‌వీ.పోతురాజు, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగలు నాగు, పెద తాడేపల్లి సొసైటీ అధ్యక్షుడు పరిమి తులసీదాస్, వీరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ ఆలపాటి కాశీవిశ్వనాధం, నాయకులు పరిమి ప్రసాద్, పరిమి రంగ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment