మేనేజర్‌తో వాగ్వాదానికి దిగిన సరస్వతి
అనంతపురం, గుత్తి రూరల్: సభ్యులకు తెలియకుండా డ్వాక్రా సంఘం పేరుపై రూ.5లక్షలు బ్యాంకు రుణం పొంది ఉడాయించిన కిలాడి లేడీ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని లెవెన్ స్టార్ మహిళా సంఘం సభ్యులు 2015లో లోన్ కోసం సిండికేట్ బ్యాంకును సంప్రదించారు. అయితే మేనేజర్ లోన్ దరఖాస్తును తిరస్కరించారు. సభ్యుల సంతకాలతో కూడిన డ్వాక్రా సంఘం డాక్యుమెంట్లను ఇమాంబీ అనే మహిళ తీసుకుని తాను లోను ఇప్పిస్తానని నమ్మబలికింది. కొన్ని రోజుల తర్వాత లోను గురించి డ్వాక్రా లీడర్ సరస్వతి అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. లోను మంజూరు కాలేదేమోనని భావించి మిన్నకుండిపోయారు. అయితే ఇమాంబీ బ్యాంకు సిబ్బంది, అప్పటి మెప్మా సిబ్బందితో కుమ్మక్కై రూ.5లక్షల లోను మంజూరు చేయించుకుంది.
16 నెలలపాటు కంతులు చెల్లించాక ఇమాంబీ పత్తాలేకుండా పోయింది. కంతుల చెల్లింపులు ఆగిపోవడంతో రూ.3.95 లక్షల మేర బకాయి పేరుకుపోయింది. రికవరీ కోసం బ్యాంకు మేనేజర్ ప్రమోద్‌కుమార్ సోమవారం లెవెన్ స్టార్ మహిళా సంఘం లీడర్ సరస్వతిని పిలిపించాడు. గ్రూపు పేరిట అప్పు ఉందని, చెల్లించాలని చెప్పడంతో లీడర్ నిర్ఘాంతపోయింది. తమకు తెలియకుండా, తాము లేకుండా అంతపెద్ద మొత్తం ఎప్పుడు, ఎవరికి ఇచ్చారంటూ మేనేజర్‌ను నిలదీసింది. అవన్నీ తమకు తెలియదని ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మేనేజర్ సూచించారు. ఈ మేరకు లీడర్ సరస్వతి తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమాంబీ గతంలో కూడా గుత్తి స్టేట్‌బ్యాంకులో ఐదు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నగదు డ్రా చేసి పారిపోయిందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment