వివరాలు వెల్లడిస్తున్న ప్రకాష్‌రెడ్డి
అనంతపురం: డ్వాక్రా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం వంచించిన వైనాన్ని ఎండగడుతూ ఈ నెల 8న అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ‘డ్వాక్రా ఢమరుకం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అడుగులేశారన్నారు. ఆయన మరణంతోనే సంక్పలం ఆగిపోయిందన్నారు. రాజన్న సంకల్పం నెరవేరాలంటే వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆయా మహిళలకు నేరుగా నాలుగు విడతలుగా వారి చేతికే ఇస్తామన్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఆయా వర్గాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే లక్ష రూపాయలు కానుకగా వైఎస్ జగన్ అందజేస్తారన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామన్నారు.
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని మండిపడ్డారు. ఐదేళ్లుగా మహిళలపై వేధింపులు, దాడులు అధికమయ్యాయన్నారు. మహిళా అధికారిణులు, విద్యార్థినులు, గ్రామీణ మహిళలు వివక్షకు గురయ్యారన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద రాష్ట్రంలోని మహిళలందరికీ మరుగుదొడ్లు నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్రం నిర్వీర్యం చేసిందన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌కే రోజా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని అరుణక్క, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల మహిళా విభాగం అధ్యక్షురాళ్లు బోయ గిరజమ్మ, పార్వతమ్మ, రాప్తాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అపర్ణ, అనంతపురం రూరల్ మండలం మహిళా అధ్యక్షురాలు మీనాక్షమ్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. వేలాదిగా మహిళలు తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహిళా విభాగం అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు బోయగిరిజమ్మ, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షురాలు అపర్ణ, మండల కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి, ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment