ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే | Reserve Bank of India tweaks upcoming lending rate rules | Sakshi
Sakshi News home page

ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే

Published Wed, Mar 30 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే

ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే

ఇక నుంచి కొత్త డిపాజిట్ రేటు ప్రాతిపదికన బ్యాంకు రుణాల వడ్డీ రేటు వుంటుంది. దీంతో ఆర్‌బీఐ చేసే రేట్ల మార్పు వెనువెంటనే బ్యాంకుల రుణ రేట్లలో కన్పిస్తుంది.

మూడేళ్ల వరకూ స్థిర రేటు రుణంపై కూడా ఆదే పద్ధతి
బ్యాంకింగ్‌కు ఆర్‌బీఐ తాజా ఆదేశం

ముంబై: ఇక నుంచి కొత్త డిపాజిట్ రేటు ప్రాతిపదికన బ్యాంకు రుణాల వడ్డీ రేటు వుంటుంది. దీంతో ఆర్‌బీఐ చేసే రేట్ల మార్పు వెనువెంటనే బ్యాంకుల రుణ రేట్లలో కన్పిస్తుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీచేసిన ఆదేశాలు వచ్చే నెల ఆరంభం నుంచీ అమలవుతాయి. ఇప్పటివరకూ బ్యాంకులు వాటి పాత డిపాజిట్ వ్యయాలు, ఇతర నిధుల సేకరణ వ్యయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. దాంతో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినంత మేర బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించడం లేదు. దాంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) విధానాన్ని అనుసరించాలంటూ గత డిసెంబర్‌లో ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీచేసింది.

అయితే ఈ పద్ధతి నుంచి స్థిర రేటు రుణాలకు అప్పట్లో మినహాయింపునిచ్చింది. ఫ్లోటింగ్ రేటు రుణాల రేటు మాత్రమే ఎంసీఎల్‌ఆర్ విధానం ప్రకారం అమలుకావాల్సివుంది. కానీ తాజాగా మంగళవారం ఆ మార్గదర్శకాల్లో స్వల్పమార్పు చేస్తూ మూడేళ్లవరకూ కాలపరిమితిగల స్థిర రేటు రుణంపై వడ్డీ రేటును కూడా ఎంసీఎల్‌ఆర్ ఆధారంగానే నిర్ణయించాలని బ్యాంకుల్ని ఆదేశించింది. మూడేళ్ల కాలపరిమితిపైబడిన స్థిర రేటు రుణాలపై వడ్డీ రేటును పాత పద్ధతి ప్రకారమే బ్యాంకులు నిర్ణయించుకోవొచ్చు.   ప్రతి నెలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ ప్రాతిపదికన బ్యాంకులు ఒక స్థిర రుణ రేటును నిర్ణయిస్తాయి. కొత్త డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న వడ్డీరేటు ప్రాతిపదికన ఎంసీఎల్‌ఆర్ నిర్ణయమవుతుంది.

పలు బ్యాంకులు ప్రస్తుతం తాజా డిపాజిట్ల ప్రాతిపదికన కాకుండా... స్థూల డిపాజిట్ల ప్రాతిపదికన రుణ రేటును నిర్ణయిస్తున్నాయి.  తాజా నిర్ణయం వల్ల  రెపో ద్వారా (బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ- ప్రస్తుతం 6.75 శాతం) తనకు అందిన ప్రయోజనాన్ని బ్యాంకింగ్ త్వరితగతిన వినియోగదారుకు బదలాయించినట్లవుతుంది. అలాగే వడ్డీరేటు విధానంలో మరింత పారదర్శకతకు సైతం తాజా విధానం దోహదపడుతుంది. రుణ రేటు మార్కెట్ రేటుకు అనుసంధానమవుతుంది.  కాగా మూడేళ్లు దాటిన తరువాత స్థిర రుణ రేటుకు ఎంసీఎల్‌ఆర్ నుంచి మినహాయింపు లభిస్తోంది. నిజానికి డిసెంబర్‌లో జారీచేసిన మార్గదర్శకాల్లో ఎంసీఎల్‌ఆర్ విధానం నుంచి స్థిర రుణ రేటును మినహాయించారు. అయితే ఈ విధానంలో మార్పు చేస్తూ... ఆర్‌బీఐ బ్యాంకింగ్‌కు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement