పత్తి బీమాకు ధీమా కరువు! | Cotton insurance confidence drought! | Sakshi
Sakshi News home page

పత్తి బీమాకు ధీమా కరువు!

Published Sat, Jun 11 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Cotton insurance confidence drought!

ఈ నెల 14 వరకు ప్రీమియం చెల్లింపు గడువు
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో చెల్లించని రైతులు

 సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మీద కత్తి కట్టినట్లుగా ఉంది పరిస్థితి. బీమాకు ధీమా కరువైంది. ఖరీఫ్ ఇంకా ఊపందుకోలేదు. పత్తి పంట బీమా గడువు మాత్రం సమీపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి పత్తి పంట బీమాకు ప్రీమియం చెల్లించాలి. లేకుంటే వారికి ఒక్క పైసా బీమా సొమ్ము చేతికందదు. తెలంగాణ సర్కారే స్వయంగా ఈ తేదీని గడువుగా నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గత ఖరీఫ్‌లో 42 లక్షల ఎకరాల్లో పత్తినే సాగు చేశారు. ఈసారి పత్తి సాగును తగ్గించాలని సర్కారు భావిస్తున్నా రైతులు ఇతర పంటలవైపు మరలడంలేదు. పత్తి పంటకు నష్టం జరిగితే వాతావరణ ఆధారిత బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్) కింద రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. బ్యాంకులు ఇప్పటికీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు చాలామంది ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం రుణం తీసుకునే రైతుల వివరాలు ఇస్తే వారు ప్రీమియం చెల్లించినట్లుగా భావించి బీమా జాబితాలో చేర్చుతామని బీమా కంపెనీలు చెప్పినా బ్యాంకులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకుండా ఏమాత్రం కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు ప్రీమియం గడువు పెంపుపైన సర్కారు శ్రద్ధ చూపడంలేదు.

పత్తికి బీమా ప్రీమియాన్ని రైతులు మొత్తం బీమా సొమ్ములో 5 శాతం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు భరించాల్సి ఉంది. తమ వాటాను భరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభం కాకముందే ప్రీమియం చివరి తేదీ ప్రకటించిందన్న విమర్శలూ ఉన్నాయి. తద్వారా రైతుల సంఖ్యను, రాయితీ సొమ్ము తగ్గించుకోవచ్చనేది సర్కారు ఆలోచన. అనుకూలమైన గడువు తేదీలు ప్రకటించుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ నెల 14ని చివరి గడువుగా ప్రకటించిందన్న విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement