మలికిపురం స్త్రీ శక్తి భవనాన్ని ముట్టడించిన బాధిత మహిళలతో చర్చలు జరుపుతున్న ఏపీఎం ప్రభుదాసు
మలికిపురం(రాజోలు): కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో మహిళల పేర్లు, వేర్వేరు ఫొటోలతో వేరొకరికి రుణాలిచ్చేసిన లీలలు చోటు చేసుకున్నాయి. రుణాల రికవరీ కోసం బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారం బయటపడింది. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అటు బ్యాంకు అధికారులు, ఇటు డీఆర్‌డీఏ అధికారులు పెద్దల మధ్య తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి చెల్లించాలని ఒత్తిడి వస్తుండడంతో బాధిత మహిళలు బుధవారం రోడ్డెక్కారు. దీనిపై ఇప్పటికే బాధితులు మలికిపురం గ్రీవెన్స్ సెల్‌లో తూర్పుపాలెం గ్రామ సీఫ్ నల్లి చందన కుమారిపై ఫిర్యాదు కూడా చేశారు. మహిళలు బుధవారం మలికిపురం స్త్రీ శక్తి భవనాన్ని ముట్టడించారు. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఒక బ్యాంకు ఉన్నతాధికారి హస్తం కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది.
మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పలు డాక్రా సంఘాల మహిళలు సమీప గ్రామం కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో రుణాలు పొందారు. అదే మహిళలకు మరలా రుణాలు వస్తాయని చెప్పిన గ్రామ సీఎఫ్ చందన కుమారి వారి నుంచి సంతకాలు, ఫొటోలు తీసుకుంది. ఇలా వేర్వేరు గ్రూపుల నుంచి కొందరిని ఎన్నుకుని కొత్త గ్రూపులను సృష్టించింది. కొన్నాళ్లకు రుణాలు రాలేదు సరి కదా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. బ్యాంకులకు వెళ్లిన ఆ మహిళలకు షాక్ తగిలింది. ఒక్కొక్క మహిళ పేరున రూ.45 వేల రుణాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారులకు, డీఆర్‌డీఓ అధికారులకు తెలిసింది. మహిళల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.
సీఎఫ్ చందన పలు గ్రూపుల పేరుతో రూ.12 లక్షలకు పైగా నగదు తీసుకుని తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు తెలిసింది. అలాగే స్త్రీ నిధి కూడా రూ.2.15 లక్షలను మహిళల పేరుతో సీఎఫ్ తీసుకుని వాడుకున్నట్టు డీఆర్‌డీఎ అధికారులు గుర్తించారు. సుమారు మూడేళ్ల క్రితం ఈ రుణాలు తీసినట్టు తెలుస్తోంది. ఓ బ్యాంకు అధికారి అండతో సీఎఫ్ ఈ రుణాలను తీసుకున్నట్టు స్పష్టమైంది. ఆ బ్యాంకు అధికారి బదిలీ కావడంతో రుణాల రికవరీ కోసం ప్రస్తుత అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలతో డీఆర్‌డీఎ ఏపీఎం ప్రభుదాసు చర్చలు జరిపారు. ఆందోళనలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ రమణి, రాజోలు డివిజన్ అధ్యక్షురాలు కందికట్ల గిరిజ, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు చెవ్వాకుల సూర్య ప్రకాశరావు, కందికట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తమ ఉపాధి కూలీ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నారని తూర్పుపాలెం దయ గ్రూపు సభ్యురాలు ఆకుమర్తి దుర్గా భవాని, మరియమ్మ గ్రూపు సభ్యురాలు చేట్ల పైడమ్మ వాపోతున్నారు.
విచారణ చేశాం
తూర్పుపాలెం సీఎఫ్ ఎన్.చందన కుమారిపై విచారణ చేశాం. రూ.12 లక్షల బ్యాంకు రుణాలు, మరో రూ.2 లక్షల స్త్రీ నిధులను మహిళల పేరుతో స్వాహా చేసినట్టు తేలింది. ఆమెను తొలగించాం, రికవరీకి ప్రయత్నిస్తున్నాం. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం. – జి.ప్రభుదాసు, ఏపీఎం, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment