ముంబై: పండుగల సీజన్ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మాఫీ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరించింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది. కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా ఇస్తున్నట్లు ఎస్‌బీఐ వివరించింది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ రేటు ఉంటోందని పేర్కొంది. ‘ఎకానమీ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం.
పండుగ సీజన్‌లో కొనుగోలుదారుల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాం‘ అని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా కారు, పసిడి రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఎస్‌బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్‌బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు.
పండుగ సీజన్ అమ్మకాలపై ఆటో డీలర్ల ఆందోళన: ఇక్రా
ఈ పండుగ సీజన్‌లో వాహన విక్రయాల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ఆటోమొబైల్ డీలర్లు అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. స్థూల ఆర్థికవ్యవస్థలోని సవాళ్లతో పాటు కరోనా ప్రతికూల ప్రభావాలు అమ్మకాలపై కనిపించే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇక్రా జరిపిన సర్వే ప్రకారం... ఈ పండుగ సీజన్‌లో 58శాతం మంది డీలర్లు వార్షిక ప్రాతిపదికన కేవలం 5శాతం వృద్ధిని అంచనా వేస్తున్నారు. ఏ ఒక్క డీలర్ కూడా కనీసం 10శాతం విక్రయాల వృద్ధిని అంచనా వేయలేకపోయారు. ప్యాసింజర్ వాహన విక్రయ డీలర్లలో కొంత ఆశాభావ అంచనాలు నెలకొన్నాయని, కమర్షియల్ వాహన డీలర్లలో ఒత్తిడి కొనసాగుతుందని ఇక్రా సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment