హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం | Madera welfare building in hyd | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం

Published Mon, Apr 20 2015 12:44 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

Madera welfare building in hyd

- రాష్ట్ర మేదర సంఘం మహాసభలో మంత్రులు ఈటల, జూపల్లి, లక్ష్మారెడ్డి హామీ
- మేదరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి
- సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మేదర కులస్తులను బీసీ -ఎ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ఒకే కులం ఒకే వృత్తిలో కొనసాగుతున్న మేదరులకు సీమాంధ్రుల పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్ర మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చి, తెలంగాణ మేదరులను మాత్రం బీసీ ‘ఎ’ జాబితాలో చేర్చారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మాదిరే తెలంగాణలోని మేదరులను సైతం ఎస్టీలుగా గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. మేదరుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర మేదర మహాసభ ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగింది. మేదర సంఘం అధ్యక్షుడు బాలరాజ్ అధ్యతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి రాజేందర్, విశిష్ట అతిథులుగా వైద్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మేదరుల కోసం ఒక సంక్షేమ భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మేదరుల సంక్షేమం కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరో రూ.5 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రుణాలపై ఇస్తున్న సబ్సిడీని 30 నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు.

ఆర్థిక సరళీకృత విధానాల వల్ల తెలంగాణలోని అనేక కులవృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. మేదరులు తయారు చేసిన  వెదురు బుట్టలు, చాటలు, శిబ్బి వంటి ఉత్పత్తులు కనుమరుగై పోయాయని, ఒకప్పుడు సమాజంలో చాలా గొప్పగా బతికిన మేదరులు నేడు కులవృత్తి దెబ్బతినడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ, బీసీ కులాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొసైటీలకు భూములు కేటాయించి వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి ఈటల హామీనిచ్చారు.

సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. తీరా సభకు ఆయన రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మేదరులు లేచి సీఎం కేసీఆర్ రావాలి.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం నెలకొంది. సమావేశంలో మేదర సంఘం కార్యదర్శి జొర్రీగల శ్రీనివాసులు, కన్వీనర్ మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షుడు వెంకటరాముడు, కోశాధికారి ఏకుల సత్యం, ప్రచార కార్యదర్శి గణేష్‌రావు, యువజన సంఘం అధ్యక్షుడు జొర్రీగల శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement