న్యూఢిల్లీ: పెద్ద స్థాయిలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఇంకా బలహీనంగానే ఉన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బలహీన అసెట్లు, అధిక రుణ వ్యయాలు, అంతంత మాత్రం ఆదాయాలతో ఆయా పీఎస్‌బీల పరిస్థితి భారంగా ఉందని 2023 అంతర్జాతీయ బ్యాంకింగ్ అంచనాల నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంస్థల పనితీరు మిశ్రమంగానే ఉండవచ్చని ఇందులో వివరించింది.
మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు తమ తమ మొండి బాకీల సవాళ్లను చాలా మటుకు పరిష్కరించుకున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మించి వాటి లాభదాయకత మెరుగుపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో రుణ వ్యయాలు కనిష్ట స్థాయులకు తగ్గాయని తెలిపింది. బ్యాంకుల దగ్గర నిధులు పుష్కలంగా ఉండటం.. డిమాండ్ అధికంగా ఉండటం వంటి అంశాల కారణంగా రుణాల వృద్ధికి ఊతం లభించవచ్చని, కానీ డిపాజిట్ల వృద్ధి మాత్రం మందగించవచ్చని నివేదిక వివరించింది.
అటు పరపతి విధానాలు కఠినతరం చేస్తుండటం, అధిక ద్రవ్యోల్బణంతో వినియోగదారులు సతమతమవుతుండటం వంటి కారణాలతో జీడీపీ వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయినప్పటికీ మధ్యకాలికంగా భారత ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉంటాయని, 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5–7 శాతం వృద్ధి నమోదు కావచ్చని వివరించింది.
చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్!
Comments
Please login to add a commentAdd a comment