ఆకలి సూచీలో అధోగతి! | India is ranked 111 in the GHI list | Sakshi
Sakshi News home page

ఆకలి సూచీలో అధోగతి!

Published Sat, Oct 14 2023 12:49 AM | Last Updated on Sat, Oct 14 2023 4:56 AM

India is ranked 111 in the GHI list - Sakshi

ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్‌ సిండీ మెకెయిన్‌ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్‌ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 

2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్‌ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్‌కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్‌ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. 

ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్‌ఐ అంటున్నది. 

జాబితా గమనిస్తే పాకిస్తాన్‌ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్‌ (81), నేపాల్‌ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్‌తో ఆకలి తీవ్రత భారత్‌లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్‌ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్‌తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) పేరు మారి సక్షమ్‌ అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 అయింది. కానీ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. 

ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్‌ స్టాప్‌ సెంటర్‌ (ఓఎస్‌సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్‌ స్కీమ్‌కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు.
జీహెచ్‌ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. 

ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్‌ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్‌ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. 

జీహెచ్‌ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్‌ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. 

ఒకపక్క బడ్జెట్‌ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement