ముంబై: రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం. మెర్సర్ సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్ సిద్ధం చేసిన ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. ఇండెక్స్ విలువను పరిగణిస్తే మాత్రం భారత్ గత ఏడాది విలువ (44.4) కంటే ఈ ఏడాది విలువ కొంచెం పెరిగి 45.9 కి చేరడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) మెర్సర్ అధ్యయనం చేసింది. నెదర్లాండ్ 85 ఇండెక్స్ వ్యాల్యూతో అన్నింటికంటే మెరుగ్గా ఉంది. 83.5 శాతం విలువతో ఐస్‌ల్యాండ్, 81.3 శాతం విలువతో డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 42.3తో అర్జెంటీనా అన్నింటి కంటే దిగువన ఉంది.
పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగులకు తగినంత ఆదాయం ఇవ్వగల సామర్థ్యం పెన్షన్ వ్యవస్థకు ఉందా? ఈ ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించగలదా? పెన్షన్ వ్యవస్థ సమగ్రతతో పనిచేస్తోందా? అన్న అంశాల ఆధారంగా మెర్సర్ ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌ను రూపొందించింది. అంటే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో రిటైర్మెంట్ తరువాత కూడా ఓ మోస్తరు జీవనశైలితో జీవితం గడిపేందుకు తగినంత పెన్షన్ లభిస్తుందన్నమాట. కాగా... ఈ ఏడాది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌లోకి బోట్స్‌వానా, క్రొయేషియా, కజకిస్థాన్‌లు కొత్తగా ప్రవేశించాయి. జననాల రేటు క్షీణించడం తాలూకూ ప్రభావం పలు ఆర్థిక వ్యవస్థలు, వాటి పెన్షన్ పథకాలపై పడిందని ఈ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్‌లు తమ స్కోర్‌ను పెంచకునేందుకు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది.
మెర్సర్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో పెన్షన్ వ్యవస్థ గతం కంటే కొంత మెరుగైంది. తగినంత పెన్షన్, దీర్ఘకాలం ఇవ్వగలగడమన్న రెండు సూచీల్లో ఈ మెరుగుదల కనిపించింది. కానీ.. ప్రపంచ ర్యాంకింగ్‌లలో మాత్రం వెనుకబడే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా పెన్షన్ నిధికి చందాలు ఇచ్చే నిర్బంధ వ్యవస్థ లేకపోవడం భారత్ లోపాల్లో ఒకటని తెలిపింది. ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయని, రిటైర్మెంట్‌కు ముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే తరువాత వచ్చేది చాలా తక్కువగా ఉందని కూడా ఈ సంస్థ తెలిపింది.
భారత్‌లో పెన్షన్ వ్యవస్థ తాలూకూ ఆస్తులు జీడీపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, రిటైర్మెంట్ కోసం కేటాయించే నిధులు తగినన్ని లేవనేందుకు, పొదుపు కూడా తక్కువగా ఉందనేందుకు ఇది ఒక రుజువు అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment