Mercer
-
హైదరాబాదీలకు అభినందనలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ 'మెర్సర్' తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్ ను విడుదల చేసింది. భారత్ నుంచి హైదరాబాదుకు 153వ స్థానం దక్కగా, పూణే 154వ స్థానంలోనూ, బెంగళూరు 156వ స్థానంలోనూ ఉన్నాయి. మెర్సర్ జాబితాపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత్ లో మరోసారి హైదరాబాద్ నగరమే ది బెస్ట్ సిటీగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 2015 నుంచి భారత్ లో అత్యుత్తమ నగరంగా నిలవడం హైదరాబాద్ కు ఇది ఆరోసారి అని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. Hyderabad is yet again rated as the best Indian city by Mercer This is the 6th time since 2015 Congratulations to all Hyderabadis 👏 pic.twitter.com/ZnQiI4FV29 — KTR (@KTRBRS) December 12, 2023 కాగా, మెర్సర్ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవన ప్రమాణాల పరంగా అత్యుత్తమ నగరంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ నగరం జ్యూరిచ్ కు రెండో స్థానం, న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ కు మూడో స్థానం లభించాయి. అత్యంత దారుణమైన నగరాలుగా ఎన్ జమేనా (చాద్), బెంగుయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్), ఖర్టూమ్ (సూడాన్) ర్యాంకింగ్ లో అట్టడుగున నిలిచాయి. -
పింఛను వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగువకు
ముంబై: రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం. మెర్సర్ సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ సిద్ధం చేసిన ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. ఇండెక్స్ విలువను పరిగణిస్తే మాత్రం భారత్ గత ఏడాది విలువ (44.4) కంటే ఈ ఏడాది విలువ కొంచెం పెరిగి 45.9 కి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) మెర్సర్ అధ్యయనం చేసింది. నెదర్లాండ్ 85 ఇండెక్స్ వ్యాల్యూతో అన్నింటికంటే మెరుగ్గా ఉంది. 83.5 శాతం విలువతో ఐస్‌ల్యాండ్, 81.3 శాతం విలువతో డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 42.3తో అర్జెంటీనా అన్నింటి కంటే దిగువన ఉంది. పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగులకు తగినంత ఆదాయం ఇవ్వగల సామర్థ్యం పెన్షన్ వ్యవస్థకు ఉందా? ఈ ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించగలదా? పెన్షన్ వ్యవస్థ సమగ్రతతో పనిచేస్తోందా? అన్న అంశాల ఆధారంగా మెర్సర్ ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌ను రూపొందించింది. అంటే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో రిటైర్మెంట్ తరువాత కూడా ఓ మోస్తరు జీవనశైలితో జీవితం గడిపేందుకు తగినంత పెన్షన్ లభిస్తుందన్నమాట. కాగా... ఈ ఏడాది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌లోకి బోట్స్వానా, క్రొయేషియా, కజకిస్థాన్‌లు కొత్తగా ప్రవేశించాయి. జననాల రేటు క్షీణించడం తాలూకూ ప్రభావం పలు ఆర్థిక వ్యవస్థలు, వాటి పెన్షన్ పథకాలపై పడిందని ఈ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్‌లు తమ స్కోర్‌ను పెంచకునేందుకు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది. మెర్సర్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో పెన్షన్ వ్యవస్థ గతం కంటే కొంత మెరుగైంది. తగినంత పెన్షన్, దీర్ఘకాలం ఇవ్వగలగడమన్న రెండు సూచీల్లో ఈ మెరుగుదల కనిపించింది. కానీ.. ప్రపంచ ర్యాంకింగ్‌లలో మాత్రం వెనుకబడే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా పెన్షన్ నిధికి చందాలు ఇచ్చే నిర్బంధ వ్యవస్థ లేకపోవడం భారత్ లోపాల్లో ఒకటని తెలిపింది. ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయని, రిటైర్మెంట్కు ముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే తరువాత వచ్చేది చాలా తక్కువగా ఉందని కూడా ఈ సంస్థ తెలిపింది. భారత్‌లో పెన్షన్ వ్యవస్థ తాలూకూ ఆస్తులు జీడీపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, రిటైర్మెంట్ కోసం కేటాయించే నిధులు తగినన్ని లేవనేందుకు, పొదుపు కూడా తక్కువగా ఉందనేందుకు ఇది ఒక రుజువు అని వివరించింది. -
ఆకాశంలో సగం.. అవకాశాల్లో ఎక్కడ?
ప్రస్తుతం కంపెనీలు.. పురుషులకు దీటుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. లీడర్షిప్ హోదాల్లోని మహిళలకు వేతనాలపరంగా సరిగ్గా న్యాయం జరగడం లేదు. కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2021 టోటల్ రెమ్యూనరేషన్ సర్వే (టీఆర్ఎస్)లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో పురుషుల వేతనాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల జీతభత్యాలు 95–99 శాతం స్థాయిలో ఉంటున్నాయి. కానీ మధ్య, సీనియర్ స్థాయుల్లోకి వచ్చేటప్పటికీ ఈ వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోంది. వారి వేతనాలు .. పురుష ఉద్యోగులతో పోలిస్తే 87–95 శాతం స్థాయికే పరిమితం అవుతున్నాయి. కంపెనీ లాభాల్లో కీలక పాత్ర పోషించే హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉండటం, ఎదిగే అవకాశాలు .. ప్రమోషన్ల ప్రక్రియ నెమ్మదిగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. 900 పైగా కంపెనీలు, 5,700 పైచిలుకు హోదాలు, మొత్తం మీద 14 లక్షల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. ఎంట్రీ లెవెల్లో ప్రాతినిధ్యం ఓకే.. సాంకేతిక రంగంలో ఎంట్రీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం 43 శాతంగా ఉంది. కానీ అదే మేనేజర్ స్థాయికి వచ్చే సరికి 12–17 శాతానికి పడిపోగా.. ఇక ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చేసరికి మరింత తగ్గిపోయి 4–8 శాతానికే పరిమితమైంది. ఐటీ, కస్టమర్ సర్వీస్, ఇంజినీరింగ్.. సైన్స్, మానవ వనరులు, డేటా అనలిటిక్స్ .. బిజినెస్ ఇంటెలిజెన్స్ మొదలైన విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంటోంది. మరోవైపు, లీగల్, ఆడిట్.. సేల్స్, మార్కెటింగ్.. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో చాలా తక్కువగా ఉంటోంది. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వైవిధ్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ .. జవాబుదారీతనం లేకపోవడం వల్ల అంతర్గతంగా దీనికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని మెర్సర్ సీనియర్ ప్రిన్సిపల్ మాన్సీ సింఘాల్ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళల ఉద్యోగావకాశాలు, భద్రత, జీతభత్యాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన కొత్త కార్మిక చట్ట నిబంధనలు స్వాగతించతగ్గవే అయినప్పటికీ కంపెనీలు ఈ దిశగా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థలకు విలువను జోడించే కీలక హోదాల్లో మహిళల పాత్ర పెరిగే కొద్దీ లింగ సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని తెలిపారు. -
ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెరగనున్న జీతాలు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో గత రెండు సంవత్సరాలుగా వేతనాల విషయంలో నిరాశను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ ఏడాది పంట పండనుంది. వారి వేతనాలు 9 శాతం వరకు పెరగొచ్చని ‘మెర్సర్స్ టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ తెలిపింది. 2020లో వేతన పెంపులు తగ్గడం తెలిసిందే. కానీ, ఈ ఏడాది కరోనా పూర్వపు స్థాయిలో వేతన పెంపులను కంపెనీలు చేపట్టొచ్చని ఈ సర్వే పేర్కొంది. 988 కంపెనీలు, 5,700 ఉద్యోగ విభాగాలకు సంబంధించి అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. కన్జ్యూమర్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలు 2022లో ఇతర రంగాల కంటే అధిక వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఈ సర్వే తెలిపింది. ‘‘సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయమై కరోనా పూర్వపు స్థాయిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం కీలకమైన సానుకూలత. 2022లో అన్ని రంగాల్లోనూ వేతన పెంపు 9 శాతంగా ఉండనుంది. 2020లో ఇది 7.7 శాతమే. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్‌ను ఇది తెలియజేస్తోంది’’ అని రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ మన్సీ సింఘాల్ పేర్కొన్నారు. ►సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్అండ్డీ, విక్రయాలకు ముందు సేవలు, డేటా సైన్సెస్ విభాగాల్లో 12 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి. ► టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వారికి ఈ ఏడాదే కాకుండా, రానున్న రోజుల్లోనూ ఎక్కువ వేతన ప్రయోజనాలు లభించనున్నాయి. ►ఆరంభ స్థాయి ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాల రూపంలో ఫ్రెషర్లను తీసుకుంటున్నందున.. టెక్నో ఫంక్షనల్ బాధ్యతల్లోని వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది. -
ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే
లండన్: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్ చివరిస్థానంలో నిలిచింది. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలు టాప్ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్లు వరుసగా టాప్ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన నగరం శాన్ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు). -
బతుకు ‘భాగ్య’ నగరం!
♦ దేశంలోనే మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరంగా నిలిచిన హైదరాబాద్ ♦ మెర్సర్స్ ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వేలో వెల్లడి ♦ మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో వియన్నాకు తొలి స్థానం సాక్షి, హైదరాబాద్: బతుకు.. బతికించు అన్న నానుడి శతాబ్దాల రాచనగరి భాగ్యనగరానికిఅచ్చు గుద్దినట్లు సరిపోతోంది. దేశంలో మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ విడుదల చేసిన ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ నగరంలో సామాన్యుడు మనుగడ సాగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేల్చింది. జీవన ప్రమాణాలు,ప్రజలకు అవసరమైన కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించింది. దేశంలో హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలోని పుణె, ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నిలిచాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 230 పెద్ద నగరాలను ఎంపిక చేసుకుని... అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రజాసేవలు, వినోద సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేసినట్లు మెర్సర్ సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని నగరాల్లో సింగపూర్ 26వ స్థానంతో అన్నింటికన్నా పైన నిలిచింది. నేరాలు, కాలుష్యం కూడా తక్కువ.. ‘‘దేశంలోని మిగతా నగరాలతో పొల్చితే హైదరాబాద్, పుణె నగరాల్లో నేరాల శాతం తక్కువ. వాయు కాలుష్యం కూడా తక్కువగా ఉంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిషు పాఠశాలలు వెలిశాయి. వాణిజ్య రాజధాని ముంబై (152), దేశ రాజధాని న్యూఢిల్లీ (161)ల కంటే మెరుగైన జీవన ప్రమాణాలున్నాయి..’’ అని మెర్సర్స్ సర్వేలో వెల్లడించింది. దక్షిణాసియాలోని ఇతర నగరాలకన్నా భారత్‌లోని నగరాలు సురక్షితమైనవని పేర్కొంది. ఈ సర్వేలో శ్రీలంక రాజధానికి కొలంబో 132వ స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ 193, లాహోర్ 199, కరాచీ 202, బంగ్లాదేశ్‌లోని ఢాకా 216వ స్థానాలు పొందాయి. భద్రమైన నగరం కూడా.. ప్రజల వ్యక్తిగత భద్రతపరంగా చూస్తే హైదరాబాద్‌కు 121వ స్థానం లభించింది. ఈ విభాగంలో దేశంలో 113వ ర్యాంకుతో చెన్నై తొలిస్థానంలో, 123వ ర్యాంకుతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. అంతర్గత సామర్థ్యం, నేరాల స్థాయి, స్థానిక చట్టాల అమలు, ఇతర దేశాలతో సత్సంబంధాలు తదితర విషయాలను ఈ వ్యక్తిగత భద్రత ర్యాంకులకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో లక్సెమ్‌బర్గ్ తొలి స్థానంలో బెర్న్, హెల్సింకీ, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నిత్యం హింసాత్మగ ఘటనలు జరిగే డమాస్కస్ 229, బాగ్దాద్ 230 స్థానాల్లో నిలిచాయి. వరుసగా రెండోసారి టాప్‌లో మెరుగైన జీవనానికి అనువైన నగరాల్లో భారత్ నుంచి వరుసగా రెండోసారి హైదరాబాద్ తొలిస్థానం పొందడం గమనార్హం. అయితే గతేడాది మెర్సర్ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భాగ్యనగరం ఈసారి ఒకస్థానం తగ్గింది. గతేడాది విద్యుత్ అంతరాయాలు పెరగడంతో పాటు ఎండల ధాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1,700 మరణాలు నమోదయ్యాయని మెర్సర్ పేర్కొంది. అయితే మొత్తంగా భారత్‌లో జీవన ప్రమాణాల్లో పెద్దగా ప్రగతి లేదని సర్వే స్పష్టం చేసింది. ‘‘ఆరోగ్యం, ఆస్తులు, కెరీర్ తదితర రంగాల్లో గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల తీరుపై 230 నగరాల్లో 2010 నుంచి సర్వేలు చేస్తున్నాం. భద్రతపరంగానూ ఏ నగరాలు ఉత్తమమైనవనే దానిపై కూడా అధ్యయనం చేసి వివరాలు వెల్లడిస్తున్నాం..’’ అని మెర్సర్ భారత ప్రతినిధి రుచికాపాల్ పేర్కొన్నారు. టాప్ టెన్ నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 3. ఆక్లాండ్ (న్యూజిలాండ్) 4. మ్యూనిచ్ (జర్మనీ) 5. వాంకోవర్ (కెనడా) 6. డస్సెల్‌డోర్ఫ్ (జర్మనీ) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. జెనీవా (స్విట్జర్లాండ్) 9. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) ► జీవన ప్రమాణాల్లో హైదరాబాద్ 139, పుణె 144వ స్థానంలో నిలిచాయి ► భద్రత విషయంలో చెన్నై 113, హైదరాబాద్ 121, బెంగళూరు 123వ స్థానాల్లో నిలిచాయి.