బతుకు ‘భాగ్య’ నగరం!
♦ దేశంలోనే మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరంగా నిలిచిన హైదరాబాద్
♦ మెర్సర్స్ ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వేలో వెల్లడి
♦ మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో వియన్నాకు తొలి స్థానం
సాక్షి, హైదరాబాద్: బతుకు.. బతికించు అన్న నానుడి శతాబ్దాల రాచనగరి భాగ్యనగరానికిఅచ్చు గుద్దినట్లు సరిపోతోంది. దేశంలో మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ విడుదల చేసిన ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ నగరంలో సామాన్యుడు మనుగడ సాగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేల్చింది.
జీవన ప్రమాణాలు,ప్రజలకు అవసరమైన కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించింది. దేశంలో హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలోని పుణె, ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నిలిచాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 230 పెద్ద నగరాలను ఎంపిక చేసుకుని... అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రజాసేవలు, వినోద సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేసినట్లు మెర్సర్ సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని నగరాల్లో సింగపూర్ 26వ స్థానంతో అన్నింటికన్నా పైన నిలిచింది.
నేరాలు, కాలుష్యం కూడా తక్కువ..
‘‘దేశంలోని మిగతా నగరాలతో పొల్చితే హైదరాబాద్, పుణె నగరాల్లో నేరాల శాతం తక్కువ. వాయు కాలుష్యం కూడా తక్కువగా ఉంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిషు పాఠశాలలు వెలిశాయి. వాణిజ్య రాజధాని ముంబై (152), దేశ రాజధాని న్యూఢిల్లీ (161)ల కంటే మెరుగైన జీవన ప్రమాణాలున్నాయి..’’ అని మెర్సర్స్ సర్వేలో వెల్లడించింది. దక్షిణాసియాలోని ఇతర నగరాలకన్నా భారత్‌లోని నగరాలు సురక్షితమైనవని పేర్కొంది. ఈ సర్వేలో శ్రీలంక రాజధానికి కొలంబో 132వ స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ 193, లాహోర్ 199, కరాచీ 202, బంగ్లాదేశ్‌లోని ఢాకా 216వ స్థానాలు పొందాయి.
భద్రమైన నగరం కూడా..
ప్రజల వ్యక్తిగత భద్రతపరంగా చూస్తే హైదరాబాద్‌కు 121వ స్థానం లభించింది. ఈ విభాగంలో దేశంలో 113వ ర్యాంకుతో చెన్నై తొలిస్థానంలో, 123వ ర్యాంకుతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. అంతర్గత సామర్థ్యం, నేరాల స్థాయి, స్థానిక చట్టాల అమలు, ఇతర దేశాలతో సత్సంబంధాలు తదితర విషయాలను ఈ వ్యక్తిగత భద్రత ర్యాంకులకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో లక్సెమ్‌బర్గ్ తొలి స్థానంలో బెర్న్, హెల్సింకీ, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నిత్యం హింసాత్మగ ఘటనలు జరిగే డమాస్కస్ 229, బాగ్దాద్ 230 స్థానాల్లో నిలిచాయి.
వరుసగా రెండోసారి టాప్‌లో
మెరుగైన జీవనానికి అనువైన నగరాల్లో భారత్ నుంచి వరుసగా రెండోసారి హైదరాబాద్ తొలిస్థానం పొందడం గమనార్హం. అయితే గతేడాది మెర్సర్ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భాగ్యనగరం ఈసారి ఒకస్థానం తగ్గింది. గతేడాది విద్యుత్ అంతరాయాలు పెరగడంతో పాటు ఎండల ధాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1,700 మరణాలు నమోదయ్యాయని మెర్సర్ పేర్కొంది. అయితే మొత్తంగా భారత్‌లో జీవన ప్రమాణాల్లో పెద్దగా ప్రగతి లేదని సర్వే స్పష్టం చేసింది. ‘‘ఆరోగ్యం, ఆస్తులు, కెరీర్ తదితర రంగాల్లో గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల తీరుపై 230 నగరాల్లో 2010 నుంచి సర్వేలు చేస్తున్నాం. భద్రతపరంగానూ ఏ నగరాలు ఉత్తమమైనవనే దానిపై కూడా అధ్యయనం చేసి వివరాలు వెల్లడిస్తున్నాం..’’ అని మెర్సర్ భారత ప్రతినిధి రుచికాపాల్ పేర్కొన్నారు.
టాప్ టెన్ నగరాలు
1. వియన్నా (ఆస్ట్రియా)
2. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
3. ఆక్లాండ్ (న్యూజిలాండ్)
4. మ్యూనిచ్ (జర్మనీ)
5. వాంకోవర్ (కెనడా)
6. డస్సెల్‌డోర్ఫ్ (జర్మనీ)
7. ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ)
8. జెనీవా (స్విట్జర్లాండ్)
9. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్)
10. సిడ్నీ (ఆస్ట్రేలియా)
► జీవన ప్రమాణాల్లో హైదరాబాద్ 139, పుణె 144వ స్థానంలో నిలిచాయి
► భద్రత విషయంలో చెన్నై 113, హైదరాబాద్ 121, బెంగళూరు 123వ స్థానాల్లో నిలిచాయి.