మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.
పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్‌సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్‌తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment