బ్యాంకులిక గట్టెక్కినట్లే.. | Advertisements are transparent as part of clearing bank accounts | Sakshi
Sakshi News home page

బ్యాంకులిక గట్టెక్కినట్లే..

Published Thu, May 24 2018 12:57 AM | Last Updated on Thu, May 24 2018 12:59 AM

Advertisements are transparent as part of clearing bank accounts - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) గడ్డుకాలం దాటిపోయినట్లేనని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మొండిబాకీల ప్రక్షాళన నేపథ్యంలో మరో ఒకటి రెండు త్రైమాసికాలు కొంత నష్టాలు నమోదైనా ఫర్వాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని ఏ బ్యాంకూ దివాలా తీసే పరిస్థితి ఉండబోదని, వాటికి అవసరమైన స్థాయిలో కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్‌ స్పష్టం చేశారు. ‘బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనలో భాగంగా మొండిబాకీలను పారదర్శక రీతిలో గుర్తించడం జరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు అధిక కేటాయింపులు జరపాల్సి వచ్చినా.. ఒకటి రెండు త్రైమాసికాల్లో నష్టాలు నమోదు చేసినా ఫర్వాలేదు. ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం. బ్యాంకులకు ఇక కష్టకాలం దాటిపోయినట్లే. ఇక నుంచి అంతా సానుకూలంగానే ఉండగలదు‘ అని ఆయన చెప్పారు. మొండిబాకీల భారంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  బాకీల ఎగవేత సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని కుమార్‌ చెప్పారు. బ్యాంకులను గట్టెక్కించేందుకు ప్రతిపాదించిన రూ. 2.11 లక్షల కోట్లలో ఇంకా రూ. 65,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ప్రభుత్వం ఏ బ్యాంకునూ దివాలా తియ్యనివ్వదని ఆయన చెప్పారు. పీఎస్‌బీలు అమలు చేసే సంస్కరణల ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్‌ ఇవ్వనున్నామని కుమార్‌ వివరించారు. మరోవైపు, పలు పీఎస్‌బీల్లో సీఈవో, ఎండీల స్థానాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ జాబితాలో ఆంధ్రా బ్యాంక్‌ సహా దేనా బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి.  

ఈ–కామర్స్‌ సంస్థలతో  ఆర్థిక శాఖ భాగస్వామ్యం 
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ–కామర్స్‌ సంస్థలతో జతకట్టింది. ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలను అందించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓలా, ఉబెర్‌ సహా 24కుపైగా సంస్థలతో చేతులు కలిపామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. చిన్న వ్యాపార రుణాలను అందించడమే ఈ త్రిముఖ (రుణదాత, పరిశ్రమ, ప్రభుత్వం) భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణాలను అందించాలనే లక్ష్యంతో పీఎంఎంవై పథకాన్ని ఆవిష్కరించింది. బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్స్, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఈ రుణాలను జారీచేస్తాయి. ‘ఓలా, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, డబ్బావాలాలు, కేబుల్‌ ఆపరేటర్లు, జొమోటొ వంటి పలు కంపెనీలున్నాయి. ఇవి చిన్న వ్యాపార భాగస్వాములను కలిగి ఉంటాయి. వీరికి రుణ సదుపాయం అవసరముంటుంది. ముద్రా స్కీమ్‌ కింద వీరికి సాయం చేయాలని భావిస్తున్నాం’ అని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement