బ్యాంకింగ్ కు మరింత మూలధనం సమకూర్చాలి
ప్రభుత్వానికి మూడీస్ సూచన
న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున, కేంద్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) తగిన మూలధనం సమకూర్చాలని రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అంబరసు పేర్కొన్నారు. మూలధనం సమకూర్చే విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే- బ్యాంకింగ్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.
ఆయన అభిప్రాయాల్లో మరికొన్నింటిని చూస్తే... బకాయిలు రాబట్టుకోవడంలో బ్యాంకింగ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బ్యాలెన్స్ షీట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి మొండిబకాయిల పరిణామం రూ.3.7 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా అసెట్ క్వాలిటీ సమీక్షలు, తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు బ్యాంకింగ్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది.