ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) పీడిస్తున్న మొండిబాకీలు తదితర సమస్యల పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం మద్దతు పలికింది. బ్యాంకులను ఆర్‌బీఐ మరింత క్రియాశీలకంగా పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆఫ్‌సైట్ సర్వేయర్‌గా ఉండిపోకుండా అప్రమత్తంగా ఉండే ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషించాలని అభిప్రాయపడింది. అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఈ మేరకు ఉర్జిత్ పటేల్‌కు లేఖ రాసింది. ఇటీవలే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. పీఎస్‌బీల నియంత్రణకు మరిన్ని అధికారాలు అవసరమని చెప్పిన సంగతి తెలిసిందే.
మరోవైపు, భారీగా బాకీ పడిన 40 మొండిపద్దులపై దివాలా కోర్టుకెళ్లాలన్న ఆర్‌బీఐ ఆదేశాలతో పీఎస్‌బీల పరిస్థితి మరింత దిగజారడంతో పాటు తమ ఉద్యోగాలకూ ముప్పు తప్పదంటూ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పటేల్ కఠిన వైఖరికి మద్దతుగా ఆర్‌బీఐ యూనియన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న పరిమితులను పార్లమెంటరీ స్థాయీసంఘానికి స్పష్టీకరించినందుకు పటేల్‌ను ప్రశంసిస్తూనే.. మరోవైపు, ఆర్‌బీఐ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా యూనియన్ గుర్తు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ.. బ్యాంకుల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, అవి ఇచ్చే నివేదికలను పూర్తిగా నమ్మొచ్చని ఆర్‌బీఐ గానీ భావిస్తే.. తన విధులను విస్మరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. అలా కాకుండా, రిస్క్ ఆధారిత పర్యవేక్షణ, ఆఫ్‌సైట్ నిఘా, నిర్వహణ వ్యవస్థలను ఆన్‌సైట్‌లో తనిఖీలు చేయడం వంటి త్రిముఖ వ్యూహాన్ని పాటించవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment