హైదరాబాద్/న్యూఢిల్లీ: మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా ఒక దానిలో మరొకదాన్ని విలీనం చేయాలన్న ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనమో, ప్రైవేటీకరణో.. బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గం కాబోదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నిర్వహణ లోపాలు కేవలం పీఎస్‌బీలకు మాత్రమే పరిమితం కాదని... గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు కూడా విఫలమైందని గుర్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకుల బోర్డులకు మరింత సాధికారతనివ్వాలని, రాజకీయ జోక్యం లేకుండా సమర్థంగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఇంకా చాలా మటుకు జనాభాకు బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో లేనందున.. వారికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకే కాకుండా సామాజిక కోణంలో చూసినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
సీఈవోల ఎంపిక, వారి జీతభత్యాలు, పనితీరు మదింపు, స్వతంత్ర బోర్డు సభ్యుల ఎంపిక తదితర అంశాల్లో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోకు (బీబీబీ) మరిన్ని అధికారాలు ఉండాలన్నారు. ‘బ్యాంకుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. కఠినతరమైన నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగంతో పాటు సంస్థాగతంగా సరైన వ్యవస్థ ఉంటే పీఎస్‌బీలు రాణించేందుకు అవకాశముంది’’ అని బాలకృష్ణన్ పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగ్గా పనిచేసేందుకు మరింత స్వేచ్ఛ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇన్ఫీ మరో మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యాజమాన్యమే వాటిని సరిగ్గా పనిచేయనివ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
మరో ఏడాది దాకా ప్రైవేటీకరణ ఉండదు ..
పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాబోయే సంవత్సర కాలంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఏ బ్యాంకును ప్రైవేటీకరించడం లేదా ఇతర బ్యాంకులో విలీనం చేయడమో ఉండదని పేర్కొంది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన అనంతరం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఈ విషయం చెప్పారు. ‘వచ్చే సంవత్సర కాలంలో ఏ పీఎస్‌బీని విలీనం చేయడమో లేదా ప్రైవేటీకరించడమో జరగదని ఆర్థిక మంత్రి హామీనిచ్చారు.
బ్యాంకులను మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అయినప్పటికీ.. ప్రస్తుతానికి కనీసం ఏడాది వ్యవధిలో వాటిని ప్రైవేటీకరించే యోచనేదీ లేదని ఆయన చెప్పారు’ అని వెంకటాచలం వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ స్కామ్, కుట్రదారు నీరవ్ మోదీని వెనక్కి తెప్పించే విషయంలో తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు జైట్లీతో భేటీ అయినట్లు ఆయన వివరించారు. పీఎన్‌బీ స్కాంపై విచారణ చురుగ్గా కొనసాగుతోందని మంత్రి భరోసానిచ్చినట్లు వెంకటాచలం చెప్పారు.
మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు: వినోద్ రాయ్
బ్యాంకింగ్ నియామకాల విషయంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ప్రభుత్వానికి బీబీబీకి మధ్య ఎటువంటి సమన్వయ లోపం లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించిందని ఆయన స్పష్టం చేశారు. పలు అంశాలకు సంబంధించి బీబీబీ, ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగురపర్చే లక్ష్యంతో 2016 ఏప్రిల్ 1న ఏర్పాటైన బీబీబీ కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. గడిచిన రెండేళ్లలో ఆర్‌బీఐ, ప్రభుత్వ సహకారంతో బీబీబీ తమకు అప్పగించిన పని విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని రాయ్ ఒక ఇంట ర్వ్యూలో వివరించారు. నియామక ప్రక్రియల్లో కేంద్రం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment