ముంబై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మార్కెట్ వాటాను ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కొల్లగొడుతున్నాయి. 2016 లో ఈ విభాగానికి సంబంధించి 59.4 శాతంగా ఉన్న 21 పీఎస్‌బీల వాటా 2017 జూన్ నాటికి 55.8 శాతానికి తగ్గింది. తాజాగా 2018 జూన్ నాటికి ఇది 50.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సిడ్బి రూపొందించిన త్రైమాసిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఈ ఏడాదిలో జూన్ దాకా ఎంఎస్‌ఎంఈ విభాగానికి రుణాలు 16.1 శాతం మేర పెరిగాయి. ఈ విభాగానికి పీఎస్‌బీల రుణాల వృద్ధి 5.5 శాతం, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 23.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద ఈ విభాగానికి రుణాల విషయంలో 2017 జూన్‌లో 28.1 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ వాటా ఈ ఏడాది జూన్ నాటికి 29.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 9.6 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది.
ఎంఎస్‌ఎంఈలకు దూకుడుగా రుణాలిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగ్గానే కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో పీఎస్‌బీల మొండిబాకీలు 14.5 శాతం నుంచి 15.2 శాతానికి పెరగ్గా, ప్రైవేట్ బ్యాంకులవి స్వల్పంగా 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. రుణ మంజూరుకు సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్‌కి పట్టే టర్నెరౌండ్ సమయం (టీఏటీ) గణనీయంగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment