మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు | Bad Loans Soar To Rs 7.7 Lakh Crore In FY17 | Sakshi
Sakshi News home page

మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు

Published Tue, May 23 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు

మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు

2016–17లో 35 శాతం పైకి
ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్‌పీఏలు
70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు
యాక్సిస్, యస్‌ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు
ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి
సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు


న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్‌ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్‌) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

 ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్‌పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్‌పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్‌ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్‌ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్‌గా మారాయి.

ఏడాదిలోనే భారీగా పెరుగుదల
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్‌ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్‌బీఐ సైతం కన్సాలిడేటెడ్‌ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్‌పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్‌పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్‌పీఏలు  58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ,  బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది.

ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు
ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్‌బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్‌పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి.

ఆర్‌బీఐ సమీక్షతో వెలుగులోకి
పీఎస్‌బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్‌) ఆర్‌బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్‌ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్‌బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్‌పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్‌బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా యాక్సిస్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్‌పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్‌పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీల విషయమై ఆర్‌బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్‌ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్‌ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్‌పీఏలు రూ.4,177 కోట్లు.  ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్‌ బ్యాంక్, ఐడీబీఐ ఎన్‌పీఏలు భారీగా పెరిగాయి.

పరిమితి దాటితే ఆంక్షలు..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్‌పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్‌వేయడం వం టివి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్‌పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్‌ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్‌పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్‌ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి.

నికర విలువను దాటేసిన ఎన్‌పీఏలు: మెకిన్సే
కన్సల్టింగ్‌ సంస్థ మెకిన్సే అండ్‌ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్‌వర్త్‌ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్‌ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే  పేర్కొంది.

ఎన్‌పీఏ ఆర్డినెన్స్‌ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్‌పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఎన్‌పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్‌బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం.  

ఆర్డినెన్స్‌ అమలు పర్యవేక్షణకు కమిటీ
ఎన్‌పీఏ ఆర్డినెన్స్‌ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్‌బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement