
ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
పీఎస్‌బీల్లో నియామకాలపై ఎస్‌బీఐ అరుంధతీ భట్టాచార్య
ముంబై: ఐఐటీ, ఐఐఎంల నుంచి అభ్యర్థులను ఉద్యోగులుగా ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు కూడా ఇవ్వాలని ఎస్‌బీఐ కోరింది. ఐఐటీ, ఐఐఎంల వంటి ఉన్నత స్థాయి సంస్థల ఏర్పాటుకు ప్రజాధనం వినియోగమవుతోందని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దేశంలోని ఉన్నత స్థాయి ప్రతిభావంతులు ఈ సంస్థల్లో ఉంటారని, కానీ వీరిని నియమించుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వీలు లేదని వివరించారు.
ఇతర ప్రైవేట్ సంస్థల మాదిరే ఐఐటీ, ఐఐఎంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను నిర్వహించి మంచి ప్రతిభ గల అభ్యర్థులను ఉద్యోగులుగా తీసుకునే వెసులుబాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులతో పీఎస్ బ్యాంకులు పోటీపడలేకపోతున్నాయని వాపోయారు. ఇలాంటి సంస్థల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించరాదని సుప్రీం కోర్టు పేర్కొందని వివరించారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ఏర్పడే ప్రతి ఖాళీని ప్రకటించాలని, అర్హత గల ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయమని పేర్కొన్నారు.