
నిధుల వేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు
♦ రూ.58,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు
♦ జాబితాలో ఎస్‌బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకులు
♦ బాసెల్–3 అవసరాల నేపథ్యంలో తప్పనిసరి
న్యూఢిల్లీ: బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా మూలధన అవసరాలను చేరుకునేందుకు, తమ ఖాతాల ప్రక్షాళనకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు)... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా ఈక్విటీ జారీ ద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేయనున్నాయి. ఎస్‌బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకు సహా పలు బ్యాంకులు ఈ దిశగా సన్నాహాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ ఒక్కటే రూ.15,000 కోట్ల సమీకరణ యత్నాల్లో ఉంది. అర్హత సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్యూఐపీ) ద్వారా నిధులను సేకరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరికి పూర్తికావచ్చు. ఇక, బీవోబీ రూ.6,000 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.16,500 కోట్లను సమీకరించనున్నాయి. ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఐడీబీఐ బ్యాంకులు ఒక్కోటీ రూ.5,000 కోట్ల సమీకరణకు గాను ఇప్పటికే బ్యాంకు బోర్డుల ఆమోదాన్ని తీసుకున్నాయి.
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,950 కోట్లను సమీకరించనుంది. అలాగే, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్‌బ్యాంకు రూ.3,500 కోట్ల చొప్పున, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రూ.2,000 కోట్ల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. కేంద్రం రూపొందించిన ఇంద్రధనుష్ క్యాక్రమంలో భాగంగా పీఎస్‌బీలు మార్కెట్ల నుంచి రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంది. 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్న బాసెల్–3 ప్రమాణాలను అందుకునేందు గాను నిధుల సమీకరణ అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం సైతం రూ.70,000 కోట్లను తనవంతు సాయంగా అందించనుంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.50,000 కోట్లను సమకూర్చగా, 2018–19 నాటికి మిగిలిన నిధులను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000కోట్లను ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే. మరోవైపు, పీఎస్‌బీల ఎన్‌పీఏలు రూ.6లక్షల కోట్లకు చేరినందున ఖాతాల ప్రక్షాళన అవసరం కూడా ఏర్పడింది.