బ్యాంకుల విలీనమే.. మందు!!
♦ అసెట్ క్వాలిటీ కష్టాలకు చెక్
♦ ప్రభుత్వ రంగంలో పటిష్టమైన బ్యాంకుల ఆవిర్భావం
♦ ప్రతికూలతల కన్నా ప్రయోజనాలే అధికం
♦ అనువుగా పీఎన్‌బీ, కెనరా తదితర బ్యాంకులు
సాక్షి, బిజినెస్ విభాగం : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీన ప్రక్రియలను వేగవంతం చేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంలో చర్చనీయమవుతున్నాయి. ఓ వైపు సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలతో తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ... మరోవైపు కేంద్రం మాత్రం విలీనాల దిశగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణిస్తూ... విలీనానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని, ఆయా బ్యాంకుల బోర్డులే మెర్జర్‌ల ప్రతిపాదనలను ముందుకు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పీఎస్‌బీల విలీనాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చిన్న స్థాయిలోనే మిగిలిపోతున్న పలు పీఎస్‌బీలకు విలీనాలు ప్రయోజనకరమే అంటున్నారు విశ్లేషకులు. నిధుల సమీకరణ వ్యయాలు తక్కువ స్థాయిలో ఉంచుకుంటూ.. లాభదాయకంగా ఉంటే భారీ, పటిష్ట బ్యాంకుల ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ సమస్యల గురించి అందరికీ తెలిసినవే కాబట్టి... ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు ప్రకటన సమయం గురించి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాతిపదికలు ఇవే కావొచ్చు..
అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రాంతీయంగా ఆయా పీఎస్‌బీలకి ఉన్న పట్టు.. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, ఆదాయాల వృద్ధి తదితర అంశాలే విలీనాలకు ప్రాతిపదిక కావచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మొదలైనవి విలీనాలకు శ్రీకారం పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్యాంకులకు తమ తమ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉండటం.. విలీన ప్రతిపాదనకు ఊతమిస్తోంది. గడిచిన ఆరు నెలలు, ఏడాది కాలంలో ఏదో ఒక సందర్భంలో విలీనాలకు తాము అనుకూలమేనని ప్రకటించడమే కాక రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సొంతంగా వనరులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఇవి చాటుకున్నాయి.
విలీన ప్రక్రియపై కొంత మేర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా బరిలో ఉండగలదని అంచనా. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మెర్జర్‌కి అనువైన బ్యాంకులుగానే కనిపిస్తున్నప్పటికీ.. విలీనాలకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరింత మూలధనం అవసరం అవుతుందని ఓ బ్రోకరేజి సంస్థకు చెందిన ఈక్విటీస్ విభాగం హెడ్ చెప్పారు. ఇక ఇండియన్ బ్యాంక్ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. విలీనాల బరిలో దూకేంత పెద్ద బ్యాంకు కాదని పేర్కొన్నారు.
ప్రధాన కారణాలు ఏంటంటే...
విలీనాలకు ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. కరెంటు అకౌంటు, సేవింగ్ అకౌంటు (కాసా) నిష్పత్తి తక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రధానమైన బలం. కాసా డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 34% వాటా ఉంటే.. ప్రైవేట్ బ్యాంకులకు 30% ఉంది. ఇక బ్యాంకుల్లో జరిగే డిపాజిట్లలో సుమారు 70% వాటా పీఎస్‌బీలదే. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ బ్యాంకులు పుంజుకుంటున్నప్పటికీ.. పీఎస్‌బీల్లోకి వచ్చి పడే డిపాజిట్ల పరిమాణం భారీగానే ఉంటోంది. గతేడాది పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇది మరోసారి సుస్పష్టంగా కనిపించింది.
పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు కోతతో.. డిపాజిట్లు తరలిపోకుండా తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి కూడా పీఎస్‌బీలకు విలీనాలు తప్పనిసరిగా మారుతోంది. రుణాలకు డిమాండ్ పుంజుకున్న పక్షంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది చాలా కీలకం. చాలా బ్యాంకులకు ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల స్థాయి లేకపోవడంతో భారీ కార్పొరేట్ రుణాలు వంటి వాటి విషయంలో అవి చిన్నా, చితకా బ్యాంకులుగానే కొనసాగాల్సి వస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా విలీనాలే ఉత్తమ మార్గంగా పరిశీలకులు చెబుతున్నారు.