మన దగ్గర 20,000 టన్నులు
చిన్నా చితకా వర్గాలను కష్టకాలంలో ఆదుకోవడమే కాకుండా..ఏకంగా దేశాన్ని కూడా బకాయిల చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహత్తర సాధనం బంగారం. ఇంతటి ఘనత కలిగిన పసిడి విషయంలో మన దేశ పరిస్థితి ఏమిటంటే..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. భారత్‌లో ఇళ్లల్లో కావొచ్చు, గుళ్లల్లో కావొచ్చు మొత్తం మీద అధికారికంగా, అనధికారికంగా 20,000 టన్నుల దాకా పసిడి ఉన్నట్లు అంచనా. దీని విలువ సుమారు 980-1,000 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. ఇందులో కేవలం 2.79 శాతం అంటే సుమారు 558 టన్నులు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈ విషయంలో మన ఆర్‌బీఐ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.
చైనాను దాటేసేవాళ్లం..
కొన్నాళ్ల క్రితం ఓ సాధువు (శోభన్ సర్కార్) కలగన్నట్లు ఉత్తర ప్రదేశ్‌లో 1,000 టన్నుల బంగారం బైటపడి ఉంటే.. అధికారికంగా పసిడి నిల్వల్లో మనం చైనాను కూడా దాటేసి ఉండేవాళ్లం. ఐఎంఎఫ్‌ని పక్కన పెట్టి దేశాల వారీగా లెక్కిస్తే ప్రస్తుతం 1,054 టన్నుల బంగారంతో చైనా అయిదో స్థానంలో ఉంది. భారత్‌లో ఇప్పటికే ఆర్‌బీఐ దగ్గరున్న 558 టన్నుల బంగారానికి వెయ్యి టన్నులు కూడా తోడై ఉంటే అధికారికంగా 1,558 టన్నుల పసిడి ఉంటుంది. తద్వారా 11వ స్థానం నుంచి చైనాని దాటి హైజంప్ చేసి ఉండే వాళ్లం.
భారతీయులు సగటున రోజుకు 2.3 టన్నుల బంగారం (దాదాపు ఒక చిన్న ఏనుగు బరువంత) కొంటారని అంచనా.
2013 మార్చ్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 830 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. పసిడి దిగుమతులను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలతో గత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు 11% తగ్గి 750 టన్నుల మేర ఉండొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
భారీగా పసిడిని దిగుమతులు చేసుకుంటున్నప్పటికీ.. ఎగుమతులు మాత్రం ఏటా 60-70 టన్నులు మాత్రమే ఉంటున్నాయి.
దేవాలయాల్లో పసిడి..
దేవాలయాలు తమకి వచ్చే బంగారాన్ని పూర్తిగా దాచి పెట్టేయడం లేదు. కొన్ని ఆలయాలు.. కొంత భాగాన్ని లాకెట్లు వంటివి తయారు చేయించి కూడా విక్రయిస్తున్నాయి.
గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం..
ఈ ఆలయానికి ఏటా రూ. 50 కోట్ల మేర ఆదాయం వస్తుండగా.. ఇందులో కొంత భా గం పసిడి రూపంలో ఉంటుంది. ఆలయం వద్ద 600 కేజీల బంగారం ఉండగా.. ఇందులో 500 కేజీలను కడ్డీల రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంచింది.
అయ్యప్ప..
శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ఏటా భక్తుల కానుకల రూపంలో రూ. 105 కోట్ల ఆదాయం.. 15 కేజీల బంగారం వస్తుంది. కానుకగా వచ్చిన బంగారాన్ని ఆలయ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు.
పసిడి పద్మనాభస్వామి..
కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బయల్పడిన సంపద విలువ (పసిడి, వజ్రాభరణాలు మొదలైన వాటన్నింటితో పాటు) సుమారు రూ. 1 లక్ష కోట్ల పైగా ఉంటుందని లెక్కేశారు. ఈ సంపదతో ప్రపంచ దృష్టి ఒక్కసారిగా పద్మనాభస్వామి వైపు మళ్లింది.
తిరుమల తిరుపతి..
తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి నెలా 80-100 కేజీల బంగారం, 100-120 కేజీల వెండి కానుకలుగా వస్తాయని అంచనా. బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాల రూపంలో వెంకన్న సంపద సుమారు రూ. 70,000 కోట్ల పైచిలుకు పైనే ఉండొచ్చని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వర్గాల కథనం. టీటీడీ ఎస్‌బీఐలో 2,250 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది. దీనిపై టీటీడీకి వడ్డీ కూడా వస్తోంది.