మన బంగారం | Sakshi Editorial On Gold | Sakshi
Sakshi News home page

మన బంగారం

Published Mon, May 20 2024 4:17 AM | Last Updated on Mon, May 20 2024 4:17 AM

Sakshi Editorial On Gold

బంగారం విలువైన లోహం మాత్రమే కాదు, సంపదకు మారుపేరు. బంగారం అంటే భవిష్యత్తుకు భరోసా. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు బంగారం మీద ఎంత అనురాగం ఉన్నా, మన భారతీయులకు బంగారం మీద ఉండే మోజు అంతకు మించినది. ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయనే ఆలోచనలతో బంగారు కలలు కనడం మనలో చాలామందికి అలవాటే! బంగారు ఆభరణాలు ఒంటికి అలంకరణలైతే, మన నుడికారంలో భాగమైన బంగారు సామెతలు, పదబంధాలు మన భాషకు అలంకరణలు. విపణిలో బంగారు ధగధగలు సరే, సాహితీ వీథుల్లోనూ కనకకాంతులు మిరుమిట్లు గొలుపుతాయి. 

ఒకానొక కాలంలో మన దేశంలో కవులకు కనకాభిషేకాలు చేసే రోజులు ఉండేవి. వేద పురాణాల నుంచి ప్రాచీన సాహిత్యంలో బంగారాన్ని గురించిన వర్ణనలు, బంగారంతో ముడిపడిన పోలికలు విరివిగా కనిపిస్తాయి. రామాయణ కాలం నాటికే బంగారం వినియోగం బాగా ఉండేది. సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లిన హనుమంతుడు రావణుడి అంతఃపురంలో ధగధగలాడే బంగారు సోపానాలతో నిర్మించిన విశాలమైన వేదికలను చూశాడట! వాటినే వాల్మీకి ‘జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణా/ హేమ సోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్‌’ అని వర్ణించాడు.

ఆదిశంకర విరచితమైన కనకధారా స్తవం తెలిసిందే! ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు ఒక నిరుపేదరాలు తన ఇంట ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరికాయ దానం చేసింది. ఆమె దుఃస్థితికి చలించిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తవం ఆశువుగా పలికినప్పుడు ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయట! 

తెలుగు కవులలో కనకాభిషేక వైభోగాన్ని పొందిన తొలికవి బహుశా శ్రీనాథుడే కాబోలు. ‘దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల’ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. తర్వాతికాలంలో అంతటి వైభోగాన్ని పొందిన మరో కవి అడిదం సూరకవి. 

‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గృహాంతర సీమవర్తి వి/భ్రాజిత పూసపా డ్విజయ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు గాక ధరాతలమునన్‌’ అని ఆశువుగా చెప్పిన పద్యానికి మెచ్చిన విజయరామరాజు అడిదం సూరకవికి కనకాభిషేకం జరిపించాడు. 

ఇప్పుడు బంగారు నాణేలే చలామణీలో లేవు. ఇక కనకాభిషేకాలెక్కడ? ఒకవైపు కవులకు కనకాభిషేకాలు జరుగుతున్న కాలంలోనే మరోవైపు ‘తోటకూరకైన దొగ్గలికైన/ తవుటి కుడుముకైన దవుటికైన/ గావ్యములను జెప్పు గాండ్యాలు ఘనమైరి’ అని వేమన నిరసించినట్లుగా నామమాత్ర ప్రతిఫలానికి కక్కుర్తి పడే చిల్లర కవులు కూడా ఎక్కువగానే ఉండేవాళ్లు.

‘పట్టిందల్లా బంగారమే’ అని అంటారు. ఇది మన పలుకుబడిలో భాగం. అక్షరాలా పట్టిందల్లా బంగారమే అయిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో గ్రీకు పురాణాల్లోని ‘మిడాస్‌ టచ్‌’ కథ చెబుతుంది. మిడాస్‌ అనే రాజుకు ముట్టుకున్నదల్లా బంగారమైపోతుందని అదృష్టదేవత వరం ఇచ్చింది. అప్పటి నుంచి అతడు తాకినదల్లా బంగారంగా మారిపోయేది. ఒకనాడు తన ముద్దుల కూతురును దగ్గరకు తీసుకుని ఎత్తుకోబోయాడు. ఆమె జీవంలేని బంగారుబొమ్మగా మారిపోయింది. బంగారం మీద అత్యాశ తెచ్చిపెట్టే అనర్థాలకు ఇదొక ఉదాహరణ.

రాచరికాలు సాగిన కాలంలో రాజులు రత్నఖచిత కనకసింహాసనాల మీద కూర్చుని పరిపాలన సాగించేవాళ్లు. యోగ్యత కలిగిన వాళ్లు కనకసింహాసనాల మీద కూర్చుంటే జనాలు ఆమోదిస్తారేమో గాని, బొత్తిగా అప్రయోజకులు కనకసింహాసనాల మీదకెక్కి పెత్తనం చలాయిస్తే జనాలు ఊరుకోరు. ‘కనకపు సింహాసనమున/ శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునన్‌/ దొనరగ పట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!’ అన్నాడు బద్దెన. 

కనక సింహాసనాసీనులైన శునకసమానులను ఎవరిని చూశాడో, ఎందరిని చూశాడో మరి! అంత తీవ్రంగా నిరసించాడు. బద్దెన పద్యంలోని కనకపు సింహాసనం ఒక ప్రతీక. అచ్చంగా బంగారంతో చేసినదే కానక్కర్లేదు. అధికార పీఠం ఏదైనా కావచ్చు. అప్రయోజకులు, అసమర్థులు అధిరోహించినప్పుడు ఒకవేళ అవి అచ్చంగా బంగారుపీఠాలే అయినా, వాటికి గౌరవభంగం తప్పదు.

ఎవరెన్ని రకాలుగా పొగిడినా, ఇంకెవరెన్ని రకాలుగా తెగిడినా బంగారం బంగారమే! బంగారం డబ్బుకు పర్యాయపదం. ‘బంగారమే డబ్బు. మిగిలినదంతా అప్పు’ అన్నాడు అమెరికన్‌ ఆర్థిక వ్యాపారవేత్త జె.పి.మోర్గాన్‌. డబ్బుకు లోకం దాసోహం అనేమాట నిరాకరించలేని సత్యం. ‘కులము గలుగు వారు/ గోత్రంబు గలవారు/ విద్యచేత విర్రవీగు వారు/ పసిడి గల్గువాని బానిస కొడుకులు’ అని వేమన ఈ సత్యాన్నే కొంత నిష్ఠురంగా పలికాడు.

బంగారానికి మెరుపు సహజలక్షణం. అలాగని ‘మెరిసేదంతా బంగారం కాదు’ అని అనుభవజ్ఞులైన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ సంగతినే ఇంగ్లిషువాళ్లు ‘ఆల్‌ దట్‌ గ్లిట్టర్స్‌ ఈజ్‌ నాట్‌ గోల్డ్‌’ అన్నారు. బంగారానికి కుల మత ప్రాంత భాషా భేదాలేవీ లేవు. ఎవరి దగ్గర ఉంటే వారికి విలువ పెంచుతుంది. బంగారానికి ఎంత విలువైనా ఉండవచ్చు. 

ఎంత ధర అయినా ఉండవచ్చు. అదేదీ మనిషిలోని సుగుణానికి సాటిరాదు. ‘భూమి అట్టడుగున ఉన్న బంగారాన్ని, భూమిపై చలామణీలో ఉన్న బంగారాన్ని తెచ్చిపోసినా అదంతా ఒక్క సుగుణానికి ఖరీదు కట్టలేదు’ అన్నాడు ప్లాటో. అయినా మన బంగారం మంచిదైతే ఇంతమంది ఇన్ని సుద్దులు చెప్పాల్సిన పని ఉండేది కాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement