ఇండియా ప్రయాణం | Sakshi Editorial On A passage to india Novel | Sakshi
Sakshi News home page

ఇండియా ప్రయాణం

Published Mon, Apr 1 2024 12:34 AM | Last Updated on Mon, Apr 1 2024 4:57 PM

Sakshi Editorial On A passage to india Novel

భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్‌ రాజ్‌ అనుభవాలతో ఇ.ఎం. ఫార్‌స్టర్‌ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్‌ సీనియర్‌లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్‌ పవార్‌ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్‌స్టర్‌ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు.

ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్  కవి వాల్ట్‌ విట్‌మన్  కవితా సంకలనం ‘పాసేజ్‌ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్‌స్టర్‌ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్‌లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్‌ లీన్ . ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం.

నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్ద మనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్‌ అజీజ్‌.

అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్‌ ఫీల్డింగ్‌. అజీజ్‌ తబ్బిబ్బయి పోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్‌. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్‌ పట్టణానికి వచ్చిన మిసెస్‌ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్‌’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్‌.

గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్త్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్‌ అయిన మూర్‌ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్‌ మూర్‌ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్‌ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్‌ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి!

కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది.

ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమై పోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్‌. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్‌మన్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు.

‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్‌స్టర్‌ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్‌స్టర్‌ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్‌ నిర్మాణానికి విరాళమిచ్చారు.

ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్‌ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్‌స్టర్‌ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది!  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement