రాహుల్ యాదవ్‌కు ‘హౌసింగ్’ ఉద్వాసన
న్యూఢిల్లీ: వివాదాస్పద సీఈవో రాహుల్ యాదవ్‌కు రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ ఉద్వాసన పలికింది. సంస్థ బోర్డు బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లతోను, మీడియాతోను ఆయన వ్యవహార శైలి సీఈవో హోదాకు తగ్గట్లుగా లేదని వ్యాఖ్యానించింది. రాహుల్ తీరు కంపెనీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సీఈవో బాధ్యతల నుంచి యాదవ్‌ను ‘తక్షణమే విముక్తుణ్ని’ చేస్తున్నట్లు వివరించింది. తాత్కాలిక సీఈవో నియామకం కోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది.
ఆసాంతం వివాదాస్పదం..
రాహుల్ యాదవ్ (26) సహ వ్యవస్థాపకుడిగా రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. తక్కువ వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందింది. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ గతేడాది 90 మిలియన్ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసింది. అయితే, కొన్నాళ్ల క్రితం తన మేథస్సుతో తూగలేని ఇన్వెస్టర్లతో తాను వేగలేనంటూ, కంపెనీ నుంచి వైదొలుగుతానంటూ రాహుల్ యాదవ్ కొన్నాళ్ల క్రితం రాజీనామా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఆ తర్వాత క్షమాపణ చెప్పి, రాజీనామా వెనక్కి తీసుకున్నారు. ఇదే కాకుండా జొమాటో సంస్థపైనా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాపైనా రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదమాయ్యాయి.