Realty portal
-
NAREDCO: రానున్న నెలల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు. ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు. బలంగా డిమాండ్.. పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆన్లైన్లో వెతుకుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధర, అభివృద్ధి చెందిన ప్రాంతం, అన్ని రకాల వసతులుంటే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల కోసం ఆన్లైన్లో కొనుగోలుదారులు తెగ వెతికేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ కాస్త నెమ్మదించడంతో జూన్ నెలలో ఆన్లైన్లో సెర్చింగ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ తెలిపింది. అంతకుముందు వరుసగా రెండు నెలలు క్షీణించాయని పేర్కొంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుంచి వాస్తవ డిమాండ్ సాధ్యమవుతుందని తెలిపింది. జూన్‌లో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ నగరంలో ప్రాపర్టీల కోసం ఆన్లైన్లో శోధనలు జరిగాయని గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. రెండో స్థానంలో ముంబై, ఆ తర్వాత వరుసగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లూథియానా, పుణే, గోవా, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి, వారణాసి, అమృత్సర్, కోయంబత్తూర్, పాటా్న, మీరట్, జైపూర్, కాన్పూర్, లక్నో ప్రాంతాలలోని గృహాల కోసం ఆన్లైన్లో వెతికారని రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆన్లైన్ సెర్చింగ్ క్షీణించగా.. జూన్‌లో 9 పాయింట్లు పెరిగిందని తెలిపింది. -
హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి నియమితులయ్యారు. గతంలో జాసన్ కొఠారి వాలియంట్ ఎంటర్టైన్మెంట్ సీఈవోగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఆయన పలు స్టార్టప్స్‌కు పర్సనల్ ఇన్వెస్టర్‌గా కూడా ఉన్నారు. జాసన్ నియామకం వల్ల కంపెనీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని హౌసింగ్.కామ్ తాత్కాలిక సీఈవో రిషబ్ గుప్తా ధీమా వ్యక్తంచేశారు. -
రాహుల్ యాదవ్‌కు ‘హౌసింగ్’ ఉద్వాసన
న్యూఢిల్లీ: వివాదాస్పద సీఈవో రాహుల్ యాదవ్‌కు రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ ఉద్వాసన పలికింది. సంస్థ బోర్డు బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లతోను, మీడియాతోను ఆయన వ్యవహార శైలి సీఈవో హోదాకు తగ్గట్లుగా లేదని వ్యాఖ్యానించింది. రాహుల్ తీరు కంపెనీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సీఈవో బాధ్యతల నుంచి యాదవ్‌ను ‘తక్షణమే విముక్తుణ్ని’ చేస్తున్నట్లు వివరించింది. తాత్కాలిక సీఈవో నియామకం కోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది. ఆసాంతం వివాదాస్పదం.. రాహుల్ యాదవ్ (26) సహ వ్యవస్థాపకుడిగా రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. తక్కువ వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందింది. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ గతేడాది 90 మిలియన్ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసింది. అయితే, కొన్నాళ్ల క్రితం తన మేథస్సుతో తూగలేని ఇన్వెస్టర్లతో తాను వేగలేనంటూ, కంపెనీ నుంచి వైదొలుగుతానంటూ రాహుల్ యాదవ్ కొన్నాళ్ల క్రితం రాజీనామా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఆ తర్వాత క్షమాపణ చెప్పి, రాజీనామా వెనక్కి తీసుకున్నారు. ఇదే కాకుండా జొమాటో సంస్థపైనా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాపైనా రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదమాయ్యాయి.