న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ‘ధరాభారం లేని భారత్’పేరిట మూడంచెల పోరుకు దిగుతామని ప్రకటించింది. ‘‘తొలి దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్యులు మార్చి 31న తమ ఇళ్ల బయట ఆందోళనలు చేస్తారు. ఎల్పీజీ సిలిండర్లకు పూలదండలు వేసి చెవిటి బీజేపీ ప్రభుత్వానికి వినపడేలా డప్పులు, గంటలు మోగిస్తూ నిరసన తెలుపుతారు. తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 దాకా దేశవ్యాప్త ర్యాలీలు, ఆందోళనలుంటాయి. ఏప్రిల్ 2 నుంచి 4 దాకా స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నాలుంటాయి.
ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ‘ధరాభారం లేని భారత్’ధర్నాలు చేపడతాం’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. మోదీ సర్కారు దేశ ప్రజలను వంచించిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నాలుగు నెలలకు పైగా పెట్రో, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాల ధరలను పెంచలేదు. అవి పూర్తవుతూనే వాటి ధరలను రోజూ ఎడాపెడా పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తోంది. జనాన్ని పిండి ఖజానా నింపుకునే సూత్రం పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జిలు సమావేశమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించిన మీదట దీనిపై భారీ ఉద్యమానికి నిర్ణయించాం’’అని వివరించారు.
నిస్సిగ్గు దోపిడీ ఆగాల్సిందే: రాహుల్
ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు బేపర్వాగా తన ప్రాసాదాన్ని అలంకరించుకుంటున్నారంటూ ప్రధాని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో తేదీలు మారుతున్నా సమస్యలు మాత్రం యథాతథమంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఓవైపు జనాన్ని బాదుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌కు భారత్‌లో రోజుకో కొత్త రేటు. ఐదు రోజుల్లో నాలుగు దాడులు’’అని ధరల పెంపునుద్దేశించి విమర్శలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment