న్యూఢిల్లీ: గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేశామని దురహంకారపూరిత వాదనలు చేస్తూనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ద్వారా ప్రజలు సంపాదించిందంతా దోచుకుంటోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో పేదరికం అంచున జీవిస్తున్న ప్రజల జీవితాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం మార్చలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ముఖ్యమైన ప్రతి వస్తువుపైనా జీఎస్‌టీ భారం పడుతోందని, సామాన్యుడి జీవితం కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఘనకార్యాలు సాధించామంటూ ప్రచారం మొదలుపెడతారంటూ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం వాస్తవంగా సాధించినవి ఇవే..2014 నుంచి వాస్తవ ఆదాయాల్లో వృద్ధిరేటు– వ్యవసాయ కార్మికులకు: 0.8%, వ్యవసాయేతర కార్మికులకు: 0.2%, నిర్మాణ కార్మికులకు:–0.02%మాత్రమే.
అయినప్పటికీ, 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు– ఎల్పీజీ:169%, పెట్రోల్:57%, డీజిల్:78%, ఆవనూనె:58%, గోధుమపిండి:56%, పాలు:51% పెరిగాయి’’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసంఘటిత రంగంలో వాస్తవ వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయిందంటూ వచ్చిన కథనాన్ని కూడా జైరాం రమేశ్ షేర్ చేశారు. అన్ని రంగాల ఆదాయాల్లో స్తబ్ధత నెలకొనగా గౌతమ్ ఆదానీ సంపద మాత్రం 2014 నుంచి 1,225% పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మే 26వ తేదీతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment