మహేశ్వరం రంగారెడ్డి : మర్యాదగా భూమి కబ్జా విడిచి వెళ్లకపోతే గన్‌తో కాల్చేస్తానని రైతులను ఓ వ్యాపారి రివాల్వర్‌తో బెదిరించాడు. దీంతో రైతులు తిరగబడి ఆ వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో సుమారు 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోహబ్బత్‌నగర్ గ్రామానికి చెందిన వరాత్యవత్ రాజునాయక్, గోల్కొండ అంజయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం సాగు చేసుకుంటున్నారు.
ఈ భూమిని 1975లో పట్టాదారు రాంబాయమ్మ, యాదగిరమ్మలు ఇనాంగా రైతులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారస్తులు అలోబి రామ్‌కుమార్ తివారీ, అలోబి శంకర్ తివారీ, అలోబి శివకుమార్ తివారీ, సంతోష్ తివారీ, మాజీ పట్వారీ వంగ వెంకట్‌రెడ్డిలు కలిసి శుక్రవారం ఆ భూమి వద్దకు వెళ్లి ఈ భూమి తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే మర్యాద ఉండదని రైతులను హెచ్చరించారు.
రైతులు వ్యాపారుల మాటలకు బెదరకపోవడంతో రామ్‌కుమార్ తీవారీ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్చేస్తానని రైతులు శ్రీశైలం, అంజయ్యలను బెదిరించాడు. భయపడిపోయిన ఇతర రైతులు రామ్‌కుమార్ చేతిపై కొట్టడంతో రివాల్వర్ కింద పడిపోయింది. రైతులు వ్యాపారస్తులను చితకబాది, వారి వాహనాలను ధ్వంసం చేశారు. రివాల్వర్‌ను రైతులు తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు.
మహేశ్వరం సీఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఇరువురిని విచారించారు. అక్కడ రివ్వాలర్‌తో కాల్పులు జరపలేదని ఏసీపీ తెలిపారు. ఈ భూమిపై కేసు కోర్టులో ఉందని, ఇరువురు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారని, ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రివాల్వర్ ఎక్కుపెట్టలేదు
మోహబ్బత్‌నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో ఉన్న 57 ఎకరాలు మా పట్టా భూమి. అప్పట్లో రాంబాయమ్మ, యాదగిరమ్మల నుంచి కొనుగోలు చేశాం. కొంత మంది రైతులు అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి యత్నిస్తుండగా వారిని అడ్డుకోబోయాం. మా పట్టా భూమి నుంచి వెంటనే ఖాళీ చేయాలని కోరాం. రైతులు వాగ్వాదానికి దిగి కర్రలతో దాడిచేసి గాయపరిచారు.
నా లైసెన్స్ రివాల్వర్‌ను బ్యాగులో పెట్టుకున్నాను. ఎవరిపైనా కాల్చడానికి యత్నించలేదు. నా డబ్బులు, రివాల్వర్ లాక్కున్నారు. గన్ ఎక్కుపెట్టానని అసత్య ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామ్‌కుమార్ తివారి
పొలం విడిచి వెళ్లిపోవాలని రివాల్వర్‌తో బెదిరించారు..
తమ భూమి వద్దకు వచ్చి కబ్జా విడిచి వెళ్లిపోవాలని రామ్‌కుమార్ తివారీ, అతని సోదరులు రివాల్వర్‌తో బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. రామ్‌కుమార్ వద్ద ఉన్న రివాల్వర్ నాపై ఎక్కుపెట్టాడు. వెంటనే మా కుటుంబ సభ్యులు, ఇతర రైతులు దాడిచేసి రివాల్వర్‌ను లాక్కొన్నారు. తివారీలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిలోకి వచ్చి వెళ్లిపొమన్నడానికి వారు ఎవరు. భూమి మాదేనని న్యాయస్థానం మాకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. – గోల్కొండ శ్రీశైలం, రైతు, మోహబ్బత్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment